నంగునూరు, ఆగస్టు 4 : శాతవాహనుల కాలంలో నంగునూరు ఒక చారిత్రాత్మక ప్రదేశంగా విరాజిల్లిందని, అందుకు నిదర్శనం పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు లభించాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. నంగునూరులో క్షేత్రస్థాయి పరిశోధనలో గ్రామంలోని పాటిగడ్డ మీద వేలఏండ్ల నాటి మానవ నాగరికత, సంస్కృతికి చెందిన వస్తువుల ఆధారాలు, పురావస్తు వస్తువులు, ఎర్రబంక మట్టితో పూసలు, పెండేంట్లు, బొమ్మలు లభించాయని ఆయన తెలిపారు.
బొమ్మల్లో అమ్మదేవతలు, వివిధ జంతువుల రూపాలు ఉన్నాయని, వాటిని ఆనాటి కాలం ప్రజలు అలంకరణ నగలుగా ధరించే వారన్నారు. టెర్రకోట బొమ్మలు పునమానవుల జీవన సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. నంగునూరు పాటిగడ్డ మీద చాలా కాలం నుంచి పురా వస్తువులు లభిస్తున్నాయన్నారు. గతంలో లభించిన ఎద్దు తల, టెర్రకోట బొమ్మలు మధ్య ఆసియాతో సంబంధాలను స్థాపించే రుజువులుగా ఉన్నాయన్నారు.
ఇప్పుడు లభించిన బొమ్మలు గుర్రపు తల, రాజుబొమ్మ, కొండాపూర్ కోటిలింగాల వంటి శాతవాహనుల కాలం నాటి చారిత్రాక ప్రదేశాల్లో దొరికినటువంటివి అన్నారు. గుర్రపు బొమ్మ తలతో పాటు నూనెముంత, నీళ్ల గురిగిలు శాతవాహనుల కాలం నాటివని తెలిపారు.
పాటిగడ్డ మీద నలుపురంగు మట్టి పాత్రలు, నలుపు ఎరుపు రంగు పాత్రలు, పెంకులు, శాత వాహనుల కాలం కన్న ముందువన్నారు. అక్కడ దొరికిన మట్టి గొట్టాల ముక్కలకు అంటుకున్న ఇనుము చిట్టెం అక్కడ ఇనుము తయారీ పరిశ్రమ ఉండేదనడానికి నిదర్శనమన్నారు. ఇవన్నీ ఒకే చోట లభించడం చారిత్రాక విశిష్టతను తెలియజేస్తున్నదన్నారు. క్షేత్ర పరిశోధనలో తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఉన్నారన్నారు.