పేదలకు గూడు కల్పించడమే కాకుండా వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. పేదలు పైసా ఖర్చుపెట్టకుండా ప్రభుత్వమే పూర్తి డబ్బులు ఖర్చుచేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. ఉండడానికి ఇండ్లు లేక పూరిగుడిసెలు,అద్దె కొంపల్లో కాలం వెల్లదీస్తున్న కష్టజీవుల ఇంటి కలను సీఎం సాకారం చేస్తున్నారు. పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. పల్లెల్లో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. జిల్లాలో మొత్తం 15,929 ఇండ్లు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికే 5వేల ఇండ్లను లబ్ధ్దిదారులకు అందించారు. మరో 4వేలకు పైగా ఇండ్లు పంపిణీ చేస్తున్నారు. శ్రావణమాసం మంచి రోజులు కావడంతో ఇండ్ల పట్టాలు ఇచ్చి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నారు. బుధవారం ములుగు, మర్కూక్ మండలాల్లోని తిమ్మాపూర్,నాగిరెడ్డిపల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులతో మంత్రి హరీశ్‌రావు గృహ ప్రవేశాలు చేయించారు.
సిద్దిపేట, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ వేగంగా జరుగుతున్నది. ఇండ్లు పూర్తయిన చోట అధికారులు గృహప్రవేశాలు చేయిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. రూపాయి పైసా ఖర్చు లేకుండా అర్హులకే ఇండ్లు వస్తుండడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు నిరుపేదలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జిల్లాలో 15,929 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 5వేల ఇండ్లను ఇప్పటికే లబ్ధ్దిదారులకు అందించారు. మరో 4వేలకు పైగా ఇండ్లు లబ్ధ్దిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సిద్దిపేట నర్సపురం, గజ్వేల్ సంగాపూర్, దుబ్బాక మున్సిపాలిటీ , హుస్నాబాద్ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకతో పాటు పక్కనే ఉన్న మధిర గ్రామాల్లో వేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. సొంతింటి జాగ ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం దసరా నుంచి ఇస్తామని మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రకటించారు.
జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. జిల్లాలో 2015-16 ఆర్థ్ధిక సంవత్సరంలో 8,424 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో దుబ్బాకకు 2,685, గజ్వేల్‌కు 3,114, హుస్నాబాద్‌కు 240, జనగామకు 145, మానకొండూరుకు 40, సిద్దిపేటకు 2200 మంజూరయ్యాయి. 2016-17 ఆర్థ్ధిక సంవత్సరంలో దుబ్బాకకు 702, గజ్వేల్‌కు 839, హుస్నాబాద్‌కు 400, జనగామకు 240, మానకొండూరుకు 215, సిద్దిపేటకు వెయ్యి ఇండ్లు మంజూరయ్యాయి.
సిద్దిపేట నర్సపురం, గజ్వేల్ సంగాపూర్, దుబ్బాక మున్సిపాలిటీల్లో మోడల్ కాలనీలు నిర్మించారు. ఇవి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాయి. ఇవి కాకుండా సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రత్యేకంగా ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో దుబ్బాకకు 52, గజ్వేల్‌కు 56, హుస్నాబాద్‌కు 20, మానకొండూరుకు 122, సిద్దిపేటకు 750 ఇండ్లు కేటాయించారు. సిద్దిపేట నర్సపూర్ వద్ద నిర్మించిన మోడల్ కాలనీని సీఎం కేసీఆర్ స్వయంగా లబ్ధ్దిదారులకు అందించారు. దీనికి ‘కేసీఆర్ నగర్‌గా’ నామకరణం చేశారు.
ఇక్కడ కాలనీని మరింతగా విస్తరించడానికి మరో వెయ్యి ఇండ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకతో పాటు మధిర గ్రామాలకు 1,800 ఇండ్లను మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. కొన్నింటిని లబ్ధ్దిదారులకు అందించారు.మొత్తంగా జిల్లాలో 15,929 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 5 వేలకు పైగా ఇండ్లను లబ్ధ్దిదారులకు అందించారు. మరో 4వేలకు పైగా ఇండ్లు లబ్ధ్దిదారులకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక చురుగ్గా కొనసాగుతున్నది. గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో లబ్ధ్దిదారుల ఎంపికను లాటరీ పద్ధ్దతిని ఎంపిక చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కొన్ని ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల వద్ద ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. మున్సిపాలిటీల్లో మోడల్ కాలనీలు నిర్మించి అన్ని వసతులను కల్పించింది. విశాలమైన రహదారులు, తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడంతో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాయి.
లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ముందుగా పరిశీలించి, వారి కుటుంబ యూనిట్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని గతంలో ప్రభుత్వం నుంచి ఇండ్లు తీసుకున్నారా..? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డులో పెడుతున్నారు.
నిర్ణీత గడువులోగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆ జాబితాను ఫైనల్ చేస్తున్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వస్తే ఆ పేర్లపై విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకొని లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా పక్కాగా లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతుండడంతో అర్హులకే ఇండ్లు దక్కుతున్నాయి.
అర్హులకే ఇండ్లు
ఇండ్లను మంజూరు చేశారు. దశల వారీగా నిర్మాణం పూర్తి చేస్తున్నాం. అర్హులకే ఇండ్లను ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయం. శ్రావణ మాసం శుభ ముహూర్తాలు కావడంతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నాం. జిల్లాలో నాలుగు వేలకు పైగా ఇండ్లు సిద్ధ్దంగా ఉన్నాయి. సొంతగా ఇంటి స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది దసరా నుంచి అమలు చేస్తాం.
– తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి