అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారు జర్నలిస్టులకు సైతం మేలు చేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్సీ జర్నలిస్టులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ కలిగి అర్హత ఉన్న దళిత జర్నలిస్టులకు దళితబంధు వర్తింపజేస్తామని చెప్పారు. జర్నలిస్టుల కోసం త్వరలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తానన్నారు.
సిద్దిపేట, ఆగస్టు 4 : వృత్తిధర్మం, సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి దళిత జర్నలిస్టుపై ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఐఎంఏ హాల్లో దళిత వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత జర్నలిస్టు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.
శిక్షణ పొందిన జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్నతో కలిసి శిక్షణ పొందిన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ ఉన్న దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళితబంధు అందిస్తామన్నారు. వృత్తితోపాటు సామాజిక బాధ్యత కలిగిన వారు జర్నలిస్టులని, దళిత ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం కలిగించాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తేవడంలో మల్లేపల్లి లక్ష్మయ్య కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ వచ్చాక ఎస్సీ గురుకులాల సంఖ్యను రెట్టింపు చేసుకున్నామని, అందులో సీట్లు మిగిలిపోతున్నాయని, జర్నలిస్టులు అవసరమున్న విద్యార్థులకు అవగాహన కల్పించి చేర్పించాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎస్సీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఆరోగ్య శాఖలోని శానిటేషన్, ఫుడ్, డైట్, ఎక్సైజ్ కాంట్రాక్ట్‌ల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు తీసుకు వచ్చినట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన 16శాతం రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు.
అన్ని వర్గాలతో సమానంగా సమాజంలోని ఎస్సీలు, వెనుకబడిన వర్గాలను ముందుకు తేవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ ధైర్యం వల్లే దళితబంధు సాధ్యమైందని, సమాజంలో ఎక్కువ శాతం పేదలు దళిత వర్గంలో ఉన్నారని, వారికి ఆర్థిక చేయూతనందించి దేశానికి ఉపయోగపడే సంపదగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో సాధ్యమైన దళితబంధు పథకం దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, దళిత జర్నలిస్టు సంఘం నాయకులు బబ్బురు రాజు, జంగం రాజలింగం, జనార్దన్, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు సాకి ఆనంద్, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.