మెదక్ మున్సిపాలిటీ/అందోల్, ఆగస్టు4: శ్రావణ మాసం అంటేనే శుభ ముహూర్తాల వేదిక. ఈ సమయంలో చేపట్టే కార్యాలకు తిరుగుండదని ప్రతీతి. శ్రావణంలో వరలక్ష్మీ వ్రతం అత్యంత శ్రేష్టమైనది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఆచారం. నేడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.
తొమ్మిది దారం పోగులతో తొమ్మిది ముడులు వేసి కుడి చేతికి కట్టుకుని పూజా విధానాన్ని ప్రారంభిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పాయసం, వడలు వంటివి తొమ్మిది రకాలు కానీ, ఇరవై ఒక్క రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. వ్రతాన్ని ఆచరించే మహిళలు కొత్తగా పళ్లైన వారిని తమ ఇళ్లకు పిలిచి వారికి కానుకలు, స్వీట్లు పంపిణీ చేస్తారు. ఇరుగుపొరుగు మహిళలను పిలిచి తాంబూలం, శనగలు ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. అనంతరం అమ్మవారిని స్మరిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తారు.
శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈ వ్రతం చేస్తే భర్త ఆయురారోగ్యంతో పాటు వ్యాపారాభివృద్ధి, సిరి సంపదలు మెండుగా ఉంటాయని విశ్వాసం. వ్రతం ఆచరించిన ముత్తయిదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మీ విగ్రహాన్ని అలంకరించి, పేరంటాలను పిలిచి తాంబూలం, శనగలు ఇస్తారు. ప్రతి ముత్తయిదువును మహాలక్ష్మీ రూపంగా భావించి గౌరవిస్తారు.
పూజా విధానం: శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా శ్రావణంలో రెండో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. పూజకు అవసరమైన సామగ్రిని ముందే సిద్ధం చేసుకుని వేకువజామునే నిద్రలేచి రోజువారీ కార్యక్రమాలు ముగించుకోవాలి. అనంతరం శ్రావణ పూజ మండపంలో నిండు కలశాన్ని నూతన వస్త్రంతో కప్పి పసుపు కుంకుమతో వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజచేయాలి. అమ్మవారి కలశంపై పసు పు, కుంకుమ, పూలు ఉంచి ఆవాహనం చేయాలి. వ్ర తం చేసే ముందు గణపతిని ధ్యానించి భక్తిశ్రద్ధలతో పూ జించాలి. గణపతి పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మీ నో ము ప్రారంభించాలి. ఆ తర్వాత పద్ధతి ప్రకారం మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు చేసి వాయినం ఇవ్వాలి. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించారు.
వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తే మహిళలు శ్లోకాలు పటిస్తూ చేతికి కంకణం కట్టుకోవాలి. వరలక్ష్మీ, అష్టోత్తర శతనామాలు, సహస్ర నామాలు పఠించాలి. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి అక్షింతలతో ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా మహాశివుడు, పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగల్యా బలాన్ని వివరించినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి.
– శీలంకోట ప్రవీణ్శర్మ, పురోహితుడు