అందోల్, జూలై 28 : వ్యవసాయ రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కార్ రైతులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో పంటల సాగులో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించారు. పెట్టుబడులు తగ్గించి అధిక లాభాలు సాధించడం, లాభదాయక పంటల సాగువైపు రైతులు దృష్టి సారించేలా ప్రోత్సహిస్తున్నారు. పంటల సాగులో అనుసరించాల్సిన ప్రధాన అంశాలను ఎంచుకుని క్లస్టర్ల వారీగా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేస్తున్నారు.
సంవత్సరాల తరబడి రైతులు రసాయన ఎరువులు వాడడంతో పుట్లకొద్ది పంటలు పండిన భూములు వాటి సారం కోల్పోయి నిర్జీవంగా తయారయ్యాయి. దీనిని గుర్తించిన అధికారులు ఇందుకోసం భూముల్లో సేంద్రియ పదార్థాలను పెంచే చర్యలకు ఉపక్రమించారు. ఇందుకోసం పచ్చిరొట్ట ఎరువులను సాగుచేయిస్తున్నారు. ప్రభుత్వం 65శాతం సబ్సిడీతో జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలను అందజేసి వాటిని సాగుచేసేందుకు ప్రోత్సహిస్తూ భూసారం పెరిగేలా కృషి చేస్తున్నది.
రైతులు పంట దిగుబడులు అధికంగా సాధించాలనే ఆశతో బస్తాలకు బస్తాల ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో దిగుబడి పక్కన పెడితే చీడ పీడలు పెరుగుతూ పంటలను పాడు చేయడం, భూసారం నశింప చేస్తున్నాయి. ఈవిధానానికి స్వస్తి చెప్పేందుకు అధికారులు ఎరువులను క్రమ పద్ధతిలో వాడుతూ పెట్టుబడులు తగ్గించేలా కృషి చేస్తున్నారు.
పంటలు ఏపుగా పెరిగి మంచిదిగుబడులు రావాలంటే ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇందులో ముఖ్యంగా భాస్వరం చేసేపని ఎంతో ఉంటుంది. డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువుల వల్ల భాస్వరం భూమిలోకి చేరుతుంది. పూర్తిస్థాయిలో ఎరువులు పంటలకు ఉపయోగపడుతాయి. పంట ఏపుగా, ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి.
ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒకదశలో క్వింటాల్ పత్తి రికార్డు స్థాయిలో రూ.14వేల వరకు పలికింది. రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి క్రేజ్ కూడా ఉండడంతో రైతులు పెద్దఎత్తున పత్తిని సాగుచేసేందుకే మొగ్గు చూపున్నారు. ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది. అధికారులు ప్రస్తుతం పత్తి, కంది విస్తీర్ణాన్ని మరింత పెంచి మంచి దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటూ రైతులు రెండు పంటలు పండించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
వరిపంట విషయంలో నాట్లు వేసే కూలీల కొరత పెరగడంతో పాటు కూలీలకు చెల్లించే కూలీ ధరలు సైతం ఎక్కువయ్యాయి. కొత్తగా నాట్లు వేసేందుకు వచ్చే వారికి తగిన నైపుణ్యం ఉండడంలేదు. ఒక్కోసారి సరైన సమయానికి నాట్లు పడక పంట దిగుబడులపై సైతం ప్రభావం చూపుతున్నది. దీంతో నేరుగా విత్తనాలు వెదజల్లడం ద్వారా పెట్టుబడులు భారీగా తగ్గుతుడడంతో పాటు పంట కాలం సైతం తగ్గనుండడంతో ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనివల్ల 25 నుంచి 30 శాతం వరకు నీళ్లు ఆదా అవుతండగా రైతులకు 7 నుంచి 8 కిలోల వరకు ఖర్చు తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
రైతులు పంటల సాగులో ఎరువుల వాడకం తగ్గించి, దిగుబడి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే రైతులకు ప్రభుత్వ పరంగా సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందజేశాం. రైతులు తమ సూచనలు, సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలి.
– అరుణ, జోగిపేట ఏడీఏ
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే సంబంధిత దుకాణ వ్యాపారిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తాం. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలి.
– లక్ష్మారెడ్డి, సీఐ కొండాపూర్
విత్తనాలపై రైతులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. కొనుగోలు చేసిన ప్యాకెట్లో ఉన్న విత్తనాలు ఎంతశాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. పంటకాలం పూర్తయ్యేవరకు రైతులు విత్తనాల ప్యాకెట్లు, రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
– శివకుమార్, మునిపల్లి వ్యవసాయాధికారి

నకిలీ విత్తనాలతో జాగత్త్ర
విత్తనాల ఎంపికపై శ్రద్ధ అవసరం
కొనుగోలు రసీదులు తప్పనిసరి
మునిపల్లి, జూలై 28 : “చెట్టు నంబర్ వన్ అయితే.. కాయ నంబర్ వన్ అవుతుంది”.. ఇది ఓ సినిమాలో డైలాగ్. మరి చెట్టే నంబర్ వన్ కావాలంటే విత్తనం నంబర్ వన్ అయ్యి ఉండాలి. ప్రస్తుతం వానకాలం పంటలు సాగుచేస్తున్నారు.ఈ తరుణంలో విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. రైతులు నిర్లక్ష్యం వహిస్తే వారి కష్టం అంతా వృథా అవుతుంది. ఇందుకోసం అప్రమత్తత ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
వర్షాలు పడితే చాలు రైతులు తెలిసీ తెలియక ఫర్టిలైజర్లు లేదా గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్వహించే దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించే కొంతమంది వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా తక్కువ ధరకు విత్తనాలు వస్తున్నాయని కొనుగోలు చేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
మునిపల్లి మండలంలో విచ్చలవిడిగా ఫర్టిలైజర్ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. అందులో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఉన్నాయో కూడా ప్రశ్నార్థకం. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సంబంధితశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేస్తూ, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.