జగదేవ్‌పూర్, మే 26 : బంధువుల ఇంట్లో ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది. ఇంట్లో నుంచి బయలుదేరిన పదిహేను నిమిషాలకే ప్రమాదంలో వారి ప్రాణాలు గాల్లో కలిశాయి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో పుట్టెడు విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో తోటికోడళ్లు మృతిచెందారు. అలాగే, భర్త మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్యాసింజర్ ఆటోను అతివేగంతో ఎదురుగా వచ్చి లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్-అలిరాజ్‌పేట గ్రామాల మధ్య కల్వర్టు సమీపంలో గురువారం జరిగింది. జగదేవ్‌పూర్ ఎస్సై కృష్ణమూర్తి, స్థానికుల వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీగిరిపల్లి కనకయ్య ఆటోలో కొట్టాల కవిత, కొట్టాల లలిత, కొంతం చంద్రయ్య, కొంతం లక్ష్మి, కొంపల్లి (శ్రీపతి) కనకవ్వ మెదక్ జిల్లా తూప్రాన్ మం డలం ఇస్లాంపూర్ గ్రామానికి తమ సమీప బంధువుల ఇంట్లో ప్రథమ వర్ధంతికి ప్యాసింజర్ ఆటోలో బయలు దేరారు.
ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే జగదేవ్‌పూర్-అలిరాజ్‌పేట గ్రామాల మధ్య కల్వర్టు సమీపానికి వెళ్లగానే, ఎదురుగా హర్యానాకు చెందిన లారీ అతివేగంగా వచ్చి వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిసి మొత్తం ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ శ్రీగిరిపల్లి కనకయ్య (30), ఆటోలో ప్రయాణిస్తున్న కొట్టాల కవిత (26) తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందారు.
మిగతా నలుగురిని హుటాహుటినా 108 అంబులెన్సులో గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ కొంతం చంద్రయ్య, కొట్టాల లలిత మృతిచెందారు. తీవ్రగాయాలతో కొంతం లక్ష్మి, కొంపల్లి (శ్రీపతి) కనకవ్వ చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బాధిత కుటుంబంలో పుట్టెడు దు:ఖం అలుముకున్నది. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు జగదేవ్‌పూర్ ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన కొట్టాల లలిత, కొట్టాల కవిత ఇద్దరు తోటి కోడళ్లు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ సమీప బంధువుల ఇంట్లో ప్రథమ వర్ధంతికి వెళ్తూ వీరిద్దరు మృతిచెందారు. కొట్టాల కవిత భర్త నాగరాజు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొట్టాల లలిత భర్త యాదగిరి హమాలీ. అన్నదమ్ముల భార్యలు ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో పుట్టెడు విషాదం నెలకొంది. వారి బిడ్డలు తల్లులను కోల్పాయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగదేవ్‌పూర్‌కు చెందిన కొంతం చంద్రయ్య ఆటో నడిపేవా డు. గతంలో అతనికి ప్రమాదంలో గాయాలు కాగా, తన ఆటో ను శ్రీగిరిపల్లికి చెందిన కనకయ్యకు అద్దెకిచ్చి నడుపుతున్నాడు. తమ సమీప బంధువుల ఇంట్లోనే వర్ధంతికి వెళ్లే క్రమంలో తమ బంధువులందరినీ ఒకే ఆటోలో తీసుకెళ్తుండగా, మృత్యువు లారీ రూపంలో అతివేగంగా వచ్చి వారిని కబలించింది. కాగా, కొంతం చంద్రయ్య మృతిచెందగా, అతని భార్య కొంతం లక్ష్మి దవాఖానలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలను రాష్ట్ర ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ దవాఖానలో పరామర్శించి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.