ఆశాఢమాసం చివరి ఆదివారం బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నేవైద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, పాడిపంటలు కళకళలాడాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నారు. డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలతో అంతటా సందడి వాతావరణం నెలకొన్నది. వేడుకల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
– సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, జూలై 24
ఆషాఢ చివరి ఆదివారం అమ్మవార్లకు జిల్లా ప్రజలు ఘనంగా బోనాలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలతో, యువకుల తొట్టెళ్ల ఊరేగింపుతో, ఘటాల ఎదుర్కోళ్లతో గ్రామదేవతలకు ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనం నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమీన్పూర్ బీరం గూడ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీ పోచమ్మ తల్లి దేవాలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.