మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు సింగూరుకు ఎగువ నుంచి వస్తున్న వరదలతో జలకళ వచ్చింది. ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర సంగారెడ్డి, మెదక్ జిల్లాల గుండా పరుగులు పెడుతున్నది.
పుల్కల్, జూలై24: పదిహేను రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు డ్యామ్ నిండింది. దీంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. అధికారులు డ్యామ్‌పైకి సందర్శకులను అనుమతించకుండా బయట నుంచే చూసేందుకు చర్యలు చేపట్టారు.
సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 27.313 టీఎంసీల నీరు చేరింది. శుక్రవారం భారీగా వరద చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు శనివారం ఉదయం 11 గంటలకు రెండు గేట్లను ఎత్తగా, వరద ఉధృతి దృశ్య మధ్యాహ్నం ఒంటి గంటకు మరో గేటును ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 15,993 క్యూసెక్యుల కొనసాగగా, అవుట్ ఫ్లో 13,493 క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.
ఇందులో క్రస్ట్ గేట్ల ద్వారా 10,500 క్యూసెక్యులు, జెన్కో ద్వారా 2,500 క్యూసెక్యుల నీరు బయటకు వెళ్తుందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో జలవిద్యుత్ కేంద్రం ద్వారా చరిత్రలో నిలిచే విధంగా 17.3 మిలియన్ యూనిట్ల విద్యు త్ ఉత్పత్తి అయినట్లు ఏడీ కురిమి పాండయ్య తెలిపారు.
కాగా, ఈసారి మొదట్లో జూలై మాసంలోనే అధికంగా వానలు పడి ప్రాజెక్టులోకి వరద చేరడంతో జల విద్యుత్ కేంద్రం ద్వారా 14 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బైన్లతో ఇప్పటి వరకు 0.32 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. ఈ విద్యుత్‌ను జోగిపేట, సదాశివపేట పట్టణ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు సిం గూరు ప్రాజెక్టుకు వచ్చే వదరపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సం గారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చం టి క్రాంతికిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహంపై ఆరా తీస్తున్నారు.