శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాను వాన ముంచెత్తింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పలు చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. మోయతుమ్మెద, కూడవెల్లి వాగుల్లో వరద ఉరకలెత్తుతున్నది. వర్గల్ మండలం నాచారం లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం వద్ద హల్దీ వాగు పరవళ్లు తొక్కుతోంది. పంట పొలాల్లోకి నీరు చేరుకోవడంతో కొంత మేర నష్టం వాటిల్లింది.
మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద కూడవెల్లి వాగు బ్రిడ్జిపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు.
కోహెడ మండలం బస్వాపూర్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తగా, హన్మకొండ-సిద్దిపేట రహదారిపై వాహన రాకపోకలు నిలిచి పోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 23
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం పడింది. కొన్ని మండలాల్లో భారీ వర్షం, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని దాదాపు అన్ని వాగులు, చెక్‌డ్యామ్‌లు వర్షపునీటితో పొంగిపొర్లుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు మత్తడి పడుతున్నాయి. పలు చెరువులు, కుంటలు మత్తడి పడుతున్నాయి. కోహెడ మండలంలోని బస్వాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు నిండుకుండలా మారింది.
భారీ వర్షం కారణంగా పత్తి, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల్లో వర్షపు నీరు చేరింది. వర్షాలకు పలుచోట్ల ఇండ్లు కూలాయి. చెట్లు నేలకొరిగాయి. చెరువులోకి చేపలు ఎదురీదడంతో మత్స్యకారులు, స్థానికులు భారీగా చేపలు పట్టుకున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
కోహెడ, జూలై 23: కోహెడ మండలం ఎగువ ప్రాంతం గజ్వేల్, కొండపాక, చేర్యాల తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెల్లవారుజామున మోయతుమ్మెద వాగు ఉప్పొంగింది. మొదటగా పోరెడ్డిపల్లి చెక్‌డ్యాం నిండి అలుగుపారింది. అనంతరం బస్వాపూర్ చెక్‌డ్యాం నిండి బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తింది. దీంతో హన్మకొండ-సిద్దిపేట రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ఎంపీపీ కొక్కుల కీర్తి, పోరెడ్డిపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి సమాచారం మేరకు తహసీల్దార్ జావిద్ అహ్మద్, ఎంపీడీవో కుమారస్వామి, ఎస్సై నరేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వాగుకు ఇరువైపులా బారికేట్ల్లను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు, చెట్లకొమ్మలను అడ్డుగా పెట్టారు. కొద్దిసేపటి తర్వాత పోరెడ్డిపల్లి బ్రిడ్జిపై నుంచి చిన్న వాహనాలను తరలించారు. బస్వాపూర్ బ్రిడ్జి కింద నిర్మించిన గేట్ల ద్వారా నీటిని శనిగరం ప్రాజెక్ట్‌లోకి వదిలారు. దీంతో వరద ఉధృతి కొంత మేరకు తగ్గింది.
మిరుదొడ్డి, జూలై 23 : మండలంలోని అల్వాల గ్రామంలో శనివారం ఉదయం కూడవెల్లి వాగు బ్రిడ్జి దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. గజ్వేల్ ఏసీపీ రమేశ్ వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి నుంచి అల్వాల వద్ద పురాతన బ్రిడ్జిపై నుంచి కూడవెల్లి వాగు ప్రవహిస్తున్నది.
శనివారం ఉదయం సమయంలో అల్వాల నుంచి సిద్దిపేట వైపు వెళ్లడానికి ఒక వ్యక్తి తన బట్టలను విప్పుకొని సంకలో పెట్టుకొని బ్రిడ్జిపై నుంచి నీటిలో నడుచుకుంటూ వెళ్తుండగా, చెప్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్రిడ్జి నీటి ప్రవాహం వీడియోను సెల్ఫోన్లో తీశాడు.
బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వాగు బ్రిడ్జి దిమ్మకు తట్టుకున్న ముళ్ల కంపను ఆ వ్యక్తి తీసివేయంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో ఆ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగులో గల్లంతైన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ తెలియరాలేదని ఏసీపీ తెలిపారు.
వాగులో వ్యక్తి గల్లంతైన విషయాన్ని ఎంపీపీ గజ్జల సాయిలు, సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య, వైస్ ఎంపీపీ పోలీసులు రాజులు, టీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు సూకురి లింగం, కో-ఆప్టెడ్ సభ్యుడు అహ్మద్, ఉప సర్పంచ్ దిలిప్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేసుకొని పర్యవేక్షించారు. గల్లంతైన వ్యక్తి జాడ ఇంకా తెలియరాలేదు. బ్రిడ్జిపై నుంచి రాక పోకలను పోలీసులు నిలిపివేసి, పికెట్ ఏర్పాటు చేశారు.