గజ్వేల్, జూలై 23: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతున్నదని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇరిగేషన్‌శాఖ డాటా సపోర్టింగ్ సిస్టమ్‌ను తయారు చేసిందన్నారు. దీనిలో నదులు, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం, ప్రవాహ వేగం తదితర అంశాలను పొందుపర్చడం జరిగిందన్నారు. భారీ వరదలు వచ్చినప్పుడే కాకుండా సామాన్య పరిస్థితుల్లోనూ నదులు, ప్రాజెక్టుల్లో ఆయా ప్రాంతాల్లో ఎంతనీటి నిల్వలు ఉన్నాయి, కాల్వ కింద ఎంత నీటి అవసరం ఉన్నది తదితర అంశాలను లెక్కగట్టి నేరుగా నీటి విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఇటీవల వరదల వల్ల కలిగిన ప్రమాదాలు తిరిగి పునరావృత్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. రాష్ట్రం లో మొత్తం మూడు కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్లో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల పంప్‌హౌస్‌లో నిండిన నీటిని తొలగించే పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మళ్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావొద్దన్న ఆలోచనతో రాష్ట్రం మొత్తం కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాలకు అనుసంధానం చేశామన్నారు.
సింగూరు ప్రాజెక్టులోకి ప్రస్తుతం రోజూ 28.7 వేల క్యూసెక్యులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 50 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటుందని, నీటిని నేరుగా బయటకు పంపుతున్నామన్నారు. అధికారులంతా పూర్తి అప్రమత్తతో ఉన్నారని, ఆయా నదులు, ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈఎన్సీ హరి రామ్, హైడ్రాలజీ సీఈ శ్రీదేవి, ఎస్ఈలు బస్వరాజ్, వేణు, ఈఈ లు డాటా సపోర్టింగ్ సిస్టమ్ సిబ్బంది పాల్గొన్నారు.