మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్, జూలై23: భారీ వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి, కూలిపోయిన ఇండ్లను సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. పంట నష్ట పరిహారంతో పాటు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించే ప్రయత్నం చేస్తానని వారికి భరోసానిచ్చారు.
శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా హవేళీఘనపూర్ మండలం ముత్తాయికోట గ్రామం మీద నుంచి ప్రవహించే మహబూబ్ నహర్ కాల్వ కట్ట తెగిపోయి, నీళ్లన్నీ మెదక్- సర్దన ప్రధాన రహదారిపై రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శనివారం హవేళీఘనపూర్ మండలం చౌట్లపల్లి వాగు, కొచ్చేరువు తండాలో పంటనష్టం, లింగ్సాన్‌పల్లి తండాలో కూలిన ఇండ్లను పరిశీలించి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. హవేళీఘనపూర్ మండల కేంద్రం-చౌట్లపల్లి మధ్యన పారుతున్న వాగు పొంగిపొర్లడంతో కట్ట తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ పరిస్థితులను ఎమ్మె ల్సీ పరిశీలించారు. అనంతరం లింగ్సాన్‌పల్లి తండాలో భారీ వర్షాలకు కూలిన, దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి కొచ్చేరువు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుని చెరువు వాగు భారీ వర్షాలతో పొంగిపొర్లడంతో సమీపంలోని పంట పొలాల్లోకి ఇసుక మేట చేరి వరి నేలమట్టమైంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతరం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఇండ్లు కూలిన బాధితులకు తక్షణ సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు.
ఎమ్మెల్సీ వెంట హవేళీఘనపూర్ సర్పంచ్ శ్రీకాంత్, మద్దుల్వాయి సర్పంచ్ కృష్ణ, కొచ్చేరువు తండా సర్పంచ్ జంలానాయక్, లింగ్సాన్‌పల్లి తండా సర్పంచ్ రమేశ్, పార్టీ నాయకులు భిక్షపతి, ఎంపీటీసీ ప్రవీణ్, యువ నాయకులు శ్రీనునాయక్, ప్రశాంత్, పలువురు రైతులు, యువకులు ఉన్నారు.