పాపన్నపేట్, జూలై23: వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో కొత్తపల్లి వద్ద తెగిపోయిన రోడ్డు, గండిపడ్డ నాగ్సాన్పల్లి చెరువును ఆమె శనివారం పరిశీలించారు. ఏడుపాయల్లోని ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతూ వన దుర్గా ఆలయం ఎదుట నుంచి ప్రవహిస్తున్న మంజీరా నదిని ఆమె పరిశీలించారు. భక్తులు ఆలయం ముందుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
సింగూరు ప్రాజెక్టులో భారీగా వరద చేరుతుండడంతో వనదుర్గా ప్రాజెక్టుకు నీరు వదులుతున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులు రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేయాలని ఆమె కోరారు. నాగ్సాన్పల్లి చెరువుకు ఏర్పడిన గండిని పూడ్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట చైర్మన్ సతేల్లి బాలాగౌడ్, ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, సర్పంచ్‌లు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
హవేళీఘనపూర్, జూలై23: భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శమ్నాపూర్, గంగాపూర్, చౌట్లపల్లి, కాప్రాయిపల్లిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించారు.
నీటి ప్రవాహంతో కొట్టుకుపోయిన వంతెనలను పరిశీలించారు. ముత్తాయికోట వద్ద కాల్వ కొట్టుకుపోయి నీరు పొల్లాలోకి చేరడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఘనపూర్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.