సంగారెడ్డి, జూన్ 22: సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేసినట్లు పంచాయతీ రాజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో కోతకు గురైన బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.26 కోట్లు, సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.49 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామచంద్రారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ లు, అధికారులు మరమ్మతుల కోసం విన్నవించారు. ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి నారాయణఖేడ్ బహిరంగ సభలో జిల్లాలో బీటీ రెన్యువల్స్ మరమ్మతులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేశారు. జిల్లాకు మంజూరైన నిధులతో గుర్తించిన 26 పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు విడుదలైన నిధులను గుర్తించిన బీటీ రోడ్లకు వినియోగించి కొత్తగా తయారు చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలోని సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.49కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో గుర్తించిన పనులు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.