కొల్చారం, జూన్22: జేసీబీ గుంతలో పడి అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొంగోడులో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. కొంగోడు గ్రామానికి చెందిన మంగళి లాలయ్య, మంగళి శేఖర్ ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరి కుమారులు మంగళి అజయ్(9), మంగళి నర్సింహులు(9). గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. బుధవారం మధ్యాహ్న భోజనం చేసే వరకు వీరు పాఠశాలలోనే ఉన్నారు. అనంతరం నర్సింహులు, అజయ్‌తో పాటు మరో విద్యార్థి లక్ష్మణ్ కలిసి పాఠశాల సమీపంలోని పట్నం కిషన్ వ్యవసాయ పొలంలో రాళ్లను తొలిగించడానికి తవ్విన జేసీబీ గుంత వద్దకు టాయిలెట్‌కు వెళ్లారు.
అక్కడ నర్సింహులు, అజయ్ గుంతలోకి దిగి, నీట మునిగారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థి లక్ష్మణ్ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులకు తెలుపాడు. దీంతో హెచ్ఎం నవీన్ అక్కడికి వెళ్లి జేసీబీ గుంతలో గాలించగా, కొన ఊపిరితో ఉన్న అజయ్ దొరికాడు. అతడిని చికిత్స నిమిత్తం మెదక్‌లోని జిల్లా దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే కొల్చా రం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని జేసీబీ గుంతలో గాలింపు చర్యలు చేపట్టారు.
కొద్దిసేపటికి మరో విద్యార్థి నర్సింహులు మృతదేహం దొరికింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగలి లాలయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరికి కూతురు, కుమారుడు సంతానం. ప్రమాదంలో నర్సింహులు మృతి చెందాడు. మంగలి శేకులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. అందులో పెద్ద కుమారుడు అజయ్ ఈ ప్రమాదంలో మృతి చెందా డు. మృతులు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కావడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.