రామాయంపేట/చేగుంట, జూన్ 22: బీడీ కంపెనీల్లో పని చేస్తున్న అన్ని రకాల కార్మికుల వేతనాలు పెరిగినట్ల్లు హిందూ మజ్దూర్ సభ హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇదారి మల్లేశం బుధవారం తెలిపారు. నిజామాబాద్‌లోని గుజరాత్ భవన్లో బీడీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందంపై యజమానులు బీడీ అండ్ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇత్తుభాయ్, ఛటోపాధ్యాయ, లక్ష్మీకాంత్పటేల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. ఈ చర్యలు సఫలమయ్యాయి. దీంతో బీడీ చుట్టేవారికి వెయ్యి బీడీలకు అదనంగా రూ.3, ప్యాకింగ్, గంప చాట్, టేబుల్ క్లార్క్స్, బట్టి పెట్టే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న వేతనాలపై అదనంగా రూ,1500/లకు పైగా పెరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.మధు, కార్యదర్శి లక్ష్మణ్, రాష్ట్ర బీడీ కమీషన్‌దారుల సంఘం అధ్యక్షుడు చెరుకు కాశయ్య, ఉపాధ్యక్షులు తమ్మ శేఖర్, భూమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ సత్యనారాయణ, కోశాధికారి రాజేశం, అమర్నాథ్, నరేశ్, దైవాదీనం తదితరులుపాల్గొన్నారు.
బీడీ కార్మికుల చర్చలు ఎట్టకేలకు సఫలమైనట్లు మెదక్ జిల్లా బీడీ కార్మిక యూనియన్ నాయకుడు, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంది సత్యం తెలిపారు. బుధవారం రామాయంపేటలో విలేకరులుతో మాట్లాడుతూ వారం రోజులుగా బీడీ కార్మికుల మేనేజ్‌మెంటుతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపారు. ఈ అగ్రిమెంటు మే 22 నుంచి ఏప్రిల్ 2024 వరకు అమల్లో ఉంటుందన్నారు. చర్చల్లో బీడీ కార్మిక ఫెడరేషన్ అధ్యక్షుడు బాలరాజు, ఉపాధ్యక్షులు ఐరేని రాజేందర్, సుధాకర్, లక్ష్మణ్, రజనీకాంత్ పాల్గొన్నారు.