కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన పట్టణానికి వరంలా మారింది. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ హామీనివ్వడంతో పట్టణంలో గణనీయమైన అభివృద్ధికి ముందడుగు పడింది. నాలుగేండ్ల కిందట 15 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడిన నారాయణఖేడ్‌కు, ప్రభుత్వం తొలి దశలోనే రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఓ వైపు ఆదాయాన్ని సమకూర్చుకుంటూనే.. మరోవైపు దశలవారీగా మంజూరవుతున్న ప్రభుత్వ నిధులతో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి స్వయంగా వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని పాలకవర్గ సభ్యులు, అధికారులకు దిశానిర్దేశం చేసి, 61 పనులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణం కొత్తరూపు సంతరించుకుంటుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
నారాయణఖేడ్, జూన్ 16 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ నారాయణఖేడ్ ఓ వైపు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ మరో వైపు దశలవారీగా మంజూరవుతున్న నిధుల ద్వారా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పుంతలు తొక్కుతున్నది. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న నారాయణఖేడ్ నాలుగేండ్ల కింద 15వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వేగవంతమైన అభివృద్ధే లక్ష్యంగా మున్సిపాలిటీగా మార్చిన తొలి దశలోనే రూ.15 కోట్లు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన పలు పనులు పూర్తయ్యాయి..
మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటనతో పట్టణ ముఖచిత్రాన్ని మార్చివేసే పరిణామంగా చెప్పవచ్చు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ హామీనివ్వడం మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డుల్లో గణనీయమైన అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తున్న నారాయణఖేడ్ పట్టణ ప్రజల అవసరాలకనుగుణంగా అభివృద్ధి చేపట్టే విధంగా రూ. 25 కోట్ల నిధులను వెచ్చించనున్నారు.
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి స్వయంగా వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులకు దిశానిర్దేశం చేసిన మేరకు 61 పనులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ వెనువెంటనే కార్యరూపం దాల్చుతుండడం శుభపరిణామం కాగా, పెద్ద ఎత్తున నిధుల మంజూరు పట్ల పట్టణ ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 25 కోట్ల నిధులు మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలకు మోక్షం కల్పించనున్నాయి. ముఖ్యంగా నారాయణఖేడ్ పట్టణంలో రోజురోజుకూ రద్దీ పెరిగి తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు బసవేశ్వర చౌక్ నుంచి హైదరాబాద్ రోడ్డు వరకు గల బైపాస్ రోడ్డును అభివృద్ధి చేసేందుకు రూ.1.50 కోట్ల నిధులను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో భారీ వాహనాలు సైతం పట్టణంలో నుంచి వెళ్తుండడం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో రెండు లేన్ల సీసీరోడ్డు వేయడం ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నది.
అదే విధంగా ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరిన పాత ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతుండగా అధునాతనమైన నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించారు. పట్టణంలో ప్రధాన కూడలిగా ఉన్న రాజీవ్‌చౌక్ నుంచి నలు దిక్కులా భారీ స్థాయిలో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టేందుకు రూ.2.50 కోట్లు వెచ్చిస్తూ ప్రతిపాదించారు.
స్థానికంగా ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని పట్టణ క్రీడాకారుల అభ్యర్థన మేరకు రూ.25 లక్షలతో ఇండోర్ స్టేడియం రూ.13లక్షలతో జిమ్ ఏర్పాటు కానున్నది. ఇక ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి 15 వార్డులకు గాను ఒక్కో వార్డుకు రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్ల నిధులు వెచ్చించారు. ఇంకా వార్డుల వారీగా కమ్యూనిటీ భవనాల నిర్మాణం, హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు సైతం నిధులు కేటాయించారు.
పనుల గుర్తింపులో ప్రజాభీష్టానికి పెద్ద పీట వేయడంతో పాటు ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకుని పనుల వారీగా నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సహా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు వార్డుల్లో పర్యటించి ప్రజల అభ్యర్థనలు, విన్నపాలే ప్రాతిపదికగా ప్రతిపాదనలను రూపొందించారు. భారీ స్థాయిలో మంజూరైన రూ.25 కోట్ల నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచనలతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తుది రూపు నిచ్చారు.
పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా గతంలో కొన్నేండ్ల కింద నిర్మించిన మురుగు కాల్వలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరడం మరికొన్ని చోట్ల కూడుకుపోయి వర్షం కురిసిన సందర్భాల్లో నీరు రోడ్డుపై చేరడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్న క్రమంలో ఆయా మురుగు కాల్వలను ఆధునీకరించడం, అవసరమైన చోట కొత్త మురుగు కాల్వలు నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు.
అన్నివార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు ఏర్పాటవుతుండడంతో వార్డుల్లోని ప్రధాన సమస్యలు చాలా వరకు పరిష్కారం కానున్నాయి. ఏది ఏమైనా పనులన్నీ పూర్తయిన పక్షంలో దాదాపు సమస్యలు లేని పట్టణంగా కొత్త నారాయణఖేడ్ ఆవిష్కృతం కానున్నదనే అభిప్రాయం పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
నారాయణఖేడ్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో పట్టణంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల దశ మారడం ఖాయం. మున్సిపాలిటీ ఏర్పాటైన కొత్తలోనే రూ.15 కోట్ల నిధులు మంజూరు కావడంతో అవసరం మేరకు సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాం. ఇక రూ.25 కోట్ల పనుల విషయానికి వస్తే నేను స్వయంగా వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకొని దానికనుగుణంగానే ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. టెండర్ ప్రక్రియను పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించే విధంగా చూస్తా.
-మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే,నారాయణఖేడ్
నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూ.25 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. ఈ నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాం. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి గారి సూచన మేరకు తోటి కౌన్సిలర్లతో చర్చించి, ప్రతిపానదలు చేశాం. ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యేందుకు చొరవ చూపిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిలకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇతర ప్రక్రియలను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.
-రుబీనాబేగం నజీబ్, మున్సిపల్ చైర్పర్సన్, నారాయణఖేడ్