గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో ఐదో విడత పల్లె ప్రగతి విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా భాగస్వాములవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బృహత్ ప్రకృతి వనాలను సందర్శించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను, చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. గ్రామాల్లోని వీధులు శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులతో మురుగు కాల్వలు తీయించారు. పలు గ్రామాల్లో యువకులు, మహిళలు శ్రమదానం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా చేశారు.
సంగారెడ్డి, జూన్16 (నమస్తే తెలంగాణ): ఐదో విడత పల్లె ప్రగతి సంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఈనెల 3న ప్రారంభంకాగా, జిల్లాలోని 647 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మొదలు అధికారులంతా పల్లె ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 2690 కిలోమీటర్ల మేర గ్రామాల్లోని రహదారులను, 2069 కిలోమీటర్ల మేర మురుగు కాల్వలను శుభ్రం చేశారు. 4173 ప్రభుత్వ సంస్థలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. మొత్తం 647 పంచాయతీల్లో 927 శిథిలావస్థలో ఉన్న గృహాలు, భవనాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు.
గ్రామాల్లో రహదారులపై ఉన్న 1070 గుంతలను పూడ్చి వేయగా, 160 కమ్యూనిటీ మ్యాజిక్ సోక్ పిట్స్, 440 వ్యక్తిగత మ్యాజిక్ సోక్ పిట్లను నిర్మించారు. పల్లె ప్రగతి భాగంగాలో ప్రమాదకరంగా మారిన 33 బోరుబావులను, మరో 47 బావులను పూడ్చి వేశారు. గ్రామాల్లో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు 26,386 మంది ప్రజలు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించారు. త్వరలోనే ఆయా చోట్ల మొక్కలు నాటనున్నారు.
226 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా ‘పవర్ డే’ నిర్వహించి కరెంటు సమస్యలను పరిష్కరించారు. పవర్ డేలో వచ్చిన ఫిర్యాదు మేరకు 55 కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. 25 కొత్త కరెంటు మీటర్లు బిగించారు. 217 కరెంటు స్తంభాలకు థర్డ్ వైర్‌ను ఏర్పాటు చేశారు. 147 కరెంటు సమస్యలను పరిష్కరించారు.