చిన్నకోడూరు, జూన్ 15 : సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో గుండె, క్యాన్సర్వ్యాధి గ్రస్తులకు వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండలం మాచాపూర్, ఎల్లాయిపల్లి, చెల్కలపల్లి, అల్లీపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంపీపీ కూర మాణక్యరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయిస్తున్నామని, ఎల్వీ ప్రసాద్ దవాఖానలోఆపరేషన్లను ఉచితంగా చేయిస్తున్నామన్నారు. దవాఖానలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు, మందులు, కంటిఅద్దాలు అందించి కడుపునిండా భోజనం పెట్టి ఇంటి వద్ద దించుతున్నామన్నారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ దవాఖానలో మోకాలి చిప్ప మార్పిడి చికిత్సలు అందుతున్నాయన్నారు. ప్రైవేట్ దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని..అన్ని సౌకర్యాలు ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్నాయన్నారు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి అడుగు స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ప్రభుత్వం పరంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో రైతువేదిక, అంగన్వాడీ భవనం, డిజిటల్ క్లాస్‌రూం, పల్లెప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, యాదవ సంఘం, వైకుంఠధామం, ఓపెన్ జిమ్‌లు ప్రారంభించడంతో పాటు ఎస్సీ, వడ్డెర, రజక సంఘం కమ్యూనిటీ హాళ్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, క్రీడా ప్రాంగణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. మాచాపూర్ నుంచి మెట్‌పల్లికి బీటీ రోడ్డు పునరుద్ధరణ కోసం పనులు, ఎల్లాయిపల్లిలో మహిళా, ముదిరాజ్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన, బాల వికాస ప్లాంట్, దళిత బంధు లబ్ధిదారుడికి ట్రాక్టర్ అందజేశారు.
చెల్కలపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని మంత్రి పరామర్శించారు. అల్లీపూర్లో వైకుంఠధామం, డంపింగ్ షెడ్, ఓపెన్ జిమ్, పల్లెప్రకృతివనం, రెడ్డి ఫంక్షన్ హాల్, రైతువేదికను ప్రారంభించారు.
కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రామచంద్రం, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ వెంకటేశం, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, వైస్ ఎంపీపీ పాపయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు వేణు, సర్పంచ్‌లు బాబు, మహేందర్, జీవిత బాబు, బండిపల్లి రాజాబాయి, ఎంపీటీసీలు జమునాఎల్లయ్య, లచ్చయ్య, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.