హుస్నాబాద్‌టౌన్, జూన్ 15: నియోజకవర్గంలో గోదావరి జలాలు కావాలని రైతాంగం, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావాలని ఉద్యమ, ఎన్నికల సమయాల్లో ప్రజలు పలుమార్లు కోరారని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దృష్టికి ప్రాజెక్టుల విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవతీసుకుని గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.4 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారని, దీంతో లక్షా ఆరువేల ఎకరాలకు సాగునీరు అందడంతో రైతాంగానికి మేలు జరుగనుందన్నారు. 2007లో గౌరవెల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని, ఈ రిజర్వాయర్ కోసం 1814 ఎకరాల భూమి సేకరించి, ఎకరానికి రూ.2.10 లక్షల చొప్పున రూ.38.11 కోట్ల పరిహారం ఇచ్చారన్నారు. 693 ఇండ్లకుగానూ 683 ఇండ్లకు రూ.83కోట్ల పరిహారం ఇచ్చారని, కుటుంబ కలహాలతో 10 మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 937 మందికిగానూ 927మందికి రూ.74.88కోట్ల పరిహారం పంపిణీ చేశారనిన్నారు.
రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు పెంచిన తర్వాత ముంపునకు గురైన 2,055 ఎకరాల భూమికిగానూ 1,970 ఎకరాల భూమిని సేకరించి రూ.159కోట్ల పరిహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2015 వరకు 18 ఏండ్లు నిండిన 145 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.రెండులక్షలు ఇస్తామని చెప్పినా తీసుకునేందుకు ముందుకు రాలేదని, అప్పుడు మైనర్లుగా ఉన్న 35 6మంది ఇప్పుడు మేజర్లుగా మారరని చెప్పారు. రిజర్వాయర్‌లో మొదట ఎకరానికి రెండు లక్షల పదివేలు ఉండగా తర్వాత ఆరు లక్షలు, ఇప్పుడు పదిహేను లక్షలు ఎకరానికి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
ఇందులో కేవలం 84.7 ఎకరాల భూమిని మాత్రమే సేకరించాల్సి ఉందని, 97.82 శాతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా, ఇంకా 2.18శాతం మాత్రమే పని మిగిలిందన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉండి సహాయాన్ని అందించేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులు ప్రతిపక్షాల మాటలు నమ్మి నష్టపోవద్దని ఆయన సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులైన వారికి అక్కన్నపేట మండల కేంద్రంలో లేదా రామవరంలోనైనా ఇంటి స్థలం ఇచ్చి విద్యుత్, రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ నిర్వహించేందుకు సాగునీటిశాఖ అధికారులు కాల్వలను బాగుచేస్తుంటే వారిని అడ్డుకుని, చేయిచేసుకున్నారని చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితావెంకన్న, ఎంపీపీలు లకావత్మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్యా మంగ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎడబోయిన తిరుపతిరెడ్డి, లింగాల సాయన్న, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలూనాయక్, టీఆర్ఎస్ హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, పెసరు సాంబరాజు, పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెండెల ఐలయ్య, మ్యాక నారాయణ, పెద్దపల్లి అరుణ్, సూరంపెల్లి పరశురాములు, సంపత్, హరీశ్, విజయభాస్కర్, వికాస్, చిరంజీవి, ఇంతియాజ్, రాజునాయక్ పాల్గొన్నారు.