సిద్దిపేట, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సిద్దిపేట జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా.. అభివృద్ధిలో తెలంగాణకే ఆదర్శంగా నిలిచింది.. ఈ జిల్లాలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి’.. అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా మొత్తం తెలంగాణకే ఒక కేంద్ర బిందువుగా ఉండి, అభివృద్ధిలో ఆదర్శవం తమైన జిల్లా అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో జిల్లా అభివృద్ధిలో చాలా ముందుంద న్నారు. ఈ జిల్లా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, గతంలో ఈ జిల్లాలో పని చేసిన కలెక్టర్ల ద్వారా తెలుసు కొని మిగిలిన పోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తా నన్నారు.
మూడేండ్లుగా ఈ జిల్లాలో పనిచేస్తున్న అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో మాట్లాడి జిల్లా పరిస్థితులను తెలుసుకొని, అన్ని పనుల్లో ముందుకు సాగుతామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సలహాలు, సూచనల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తామని తెలిపారు.
జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఇంకా చేపట్టాల్సిన భూసేకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు?
జిల్లాలో రిజర్వాయర్లు, రైల్వేలైన్ తదితర వాటికి సంబంధించిన భూ సేకరణ విషయంలో త్వరలోనే సమీక్ష నిర్వహించి, ఏ విధంగా ముందుకెళ్లాలో చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పెద్దఎత్తున రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ప్రధాన కాల్వలు, కాల్వల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేస్తాం. ఆర్అండ్ఆర్ కాలనీల పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేలా పక్కా ప్రణాళికతో అందరి సమన్వయంతో ముందుకు వెళ్తాం.
నేను రహదారి వెంబడి వచ్చే సమయంలో చూశా. మొక్కలు, చెట్లు చాలా బాగున్నాయి. హరితహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాటిన ప్రతీ మొక్కను బతికించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ జిల్లాలో చాలాసార్లు పర్యటించా. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఆదర్శంగా నిలిచాయి. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి పనులు చూశా. ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఇతర జిల్లాలో చేసేందుకు ప్రయత్నం చేశా. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధికి కృషి చేస్తా. ఒక టీం వర్క్‌గా ముందుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో సర్కారు బడులను మరింతగా అభివృద్ధి చేసి, ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటాం. సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా.
సిద్దిపేట అర్బన్, జూన్ 13: కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్(స్థానికసంస్థలు) ముజామ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా కలెక్టర్ పలకరించారు.