బెజ్జంకి, జూన్ 13 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ‘మనఊరు -మనబడి’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం క్రాసింగ్‌లో వైకుంఠధామం, సీసీ రోడ్లను ప్రారంభించారు.
పెరుకబండలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభించారు. రూ.25 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ, మహిళా సంఘ భవనం, రూ.12 లక్షలతో నిర్మించే వారాపుసంత, రూ.30 లక్షలతో నిర్మించే అంబేద్కర్ కల్యాణ మండపం, రూ.4 లక్షలతో నిర్మించే క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులకు జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితవాడలను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. నియోజకవర్గంలో చాలా దళితవాడలను ప్రత్యేక గ్రామపంచాతీలుగా మార్చామని చెప్పారు. గ్రామ పంచాయతీలకు పెద్దపీట వేసి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నమన్నారు. అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ సరోజనను అభినందించారు.
దేశంలో అభివృద్ధి చెందిన 20 గ్రా మాలను ఎంపిక చేయగా, మన రాష్ట్రంలోనే 19 పథకాలు సాధించి ఆదర్శ రాష్ట్రంగా నిలువడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్‌ల రాష్ట్రంగా మారిందన్నారు.
రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలువాడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్ సరోజన, మంజుల, ఏఎంసీ చైర్మన్ రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ లత, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఎంపీడీవో రాము, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రైతుగా మారి మండల ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై వెళ్తున్న ఎమ్మెల్యే కల్లెపల్లి శివారులో అచ్చుకడుతున్న రైతు వద్దకు వెళ్లి నాగలి పట్టారు. ఎమ్మెల్యే అచ్చు కట్టడంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.