Medak | మెదక్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏప్రిల్‌లో ప్రారంభించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధా న్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా తాగు నీరు, విద్యు త్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎకువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని స్పష్టంచేశారు. తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 నిర్ణయించినందన్నారు.
రబీ సీజన్ కోతలు మొదలవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 21 మండలాల్లో ఏప్రిల్ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని సేకరించేందుకు 480 కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వివరించారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం కొనుగోళ్లు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ఐరిస్ కూడా తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ నగేశ్ వెల్లడించారు. టార్పాలిన్లు 14919, తూకం వేసే యంత్రాలు 700, ప్యాడీ క్లీనర్లు 500 తేమ శాతం చూసే మెషిన్లు 700 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, డీఎం సివిల్ సైప్ల్లె జగదీశ్ కుమార్, జిల్లా పౌరసరఫల అధికారి సురేశ్‌రెడ్డి, జిల్లా మారెటింగ్ అధికారి యాదయ్య, డీసీవో కరుణాకర్, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ జయ చంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్‌రెడ్డి, ఐకేపీ, పీఏసీఎస్, మారెట్ కమిటీ చైర్మన్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టంచేశారు. గురువారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. అట్రాసిటీ కేసులు, పరిషరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ రైట్స్ డే అమలు చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో కేసు పూర్వాపరాలు పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాలు జరుగాలన్నారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్‌రెడ్డి, తూప్రాన్ జయచంద్రారెడ్డి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.