మెదక్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): అర్హులు చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులతో ఆమె గూగుల్ మీట్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును డేటా ఎంట్రీ చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభు త్వం కొత్తగా అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్లు మినహియించి, మిగతా పింఛన్ల కోసం దరఖాస్తులు త్వరగా పరిష్కారం చేయాలన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్లపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి శ్రీనివాస్‌రావు. జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు ఏపీవోలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్ఐవీ పరీక్షలకు డిజిటల్ విధానం, క్యూఆర్ కోడ్‌తో సులభంగా సేవలు అందించే పోస్టర్‌ను మంగళవారం మెదక్ కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ ప్రతిమాసింగ్ విడుదల చేశారు. హెచ్ఐవీ(ఎయిడ్స్)పై ప్రజల్లో అగాగహన కలిపించేందుకు, అవసరమైన వారికి పరీక్షలు, సేవలను అందించేందుకు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో డిజిటల్ విధానం అమలు చేస్తున్నారని తెలిపారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో సమీపంలో హెచ్ఐవీ పరీక్షా కేంద్రాలు, అందుబాటులో ఉన్న సేవలు వివరాలు తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. హెచ్ఐవీపై అనుమానం ఉన్న వారు భయపడకుండా ,గోప్యతకు భంగం కలగకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ హరిప్రసాద్, పలువురు అధికారులు ఉన్నారు.