మెదక్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ)/మెదక్ రూరల్: చారిత్రాత్మక మెదక్ చర్చి వందేండ్ల ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చిలో బుధవారం తెల్లవారుజాము నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే మెదక్ చర్చికి ప్రత్యేకత ఉంది. అద్భుతమైన కళాకృతులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దీనిని నిర్మించారు. క్రిస్మస్ వేడుకకు లక్షలాది మంది భక్తుల రానుండడంతో మెదక్ డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యం త్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనుండగా, బుధవారం తెల్లవారుజాము నుంచే చర్చి ద్వారాలను తెరిచి ఉంచుతారు. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులనుద్దేశించి వ్యాక్యోపదేశం చేస్తారు. అనంతరం 10 గంటలకు రెండో ఆరాధనలో చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య దైవసందేశం వినిపించనున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు. క్రిస్మస్ వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని పాత ఉమ్మడి జిల్లాలైన మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన క్రైస్తవులే కాకుండా కుల మతాలకతీతంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సం ఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరానున్నారు. విదేశాల నుంచి సైతం పర్యాటకులు, భక్తులు హాజ రై చర్చిని సందర్శిస్తారు. తొలిరోజు లక్ష మంది వరకు భక్తులు రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
మెదక్ సీఎస్ఐ చర్చికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం వసతి గృహాల మేనేజర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెస్లీ కళాశాల, గోల్ బంగ్లా, సండే సూల్, బిషప్ బంగ్లా, పర్యాటక అతిథి గృహంతో పాటు సీఎస్ఐ వసతి గృహాలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కా కుండా చర్చి పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో చర్చి ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
మెదక్ చర్చిలో వందేండ్ల క్రిస్మస్ పండుగను పురసరించుకొని ప్రతినిధులు మహాదేవాలయ ప్రాం గణం, పరిసరాలను అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణలతో చర్చి కొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, పునరుత్థానానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో మహా దేవాలయం కొత్త శోభ సంతరించుకుంది.
మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు మెదక్ డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బొడ్మట్ పల్లి నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎకువ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
బుధవారం జరిగే మెదక్ చర్చి వందేండ్ల వేడుకలతో పాటు క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ముందుగా పాపన్నపేట మం డలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ కేక్‌ను కట్ చేస్తారు.