
జహీరాబాద్, ఆగస్టు 25 : గంజాయిని అంతరు పంటగా సాగు చేసేందుకు స్మగ్లర్లు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వానకాలం సీజన్లో రైతులు కంది, పెసరా, మినుము, అల్లం, చెరుకు తోటలో అంతరు పంటగా గంజాయిని సాగు చేస్తూ గంజాయిని స్మగ్గర్లకు అమ్మేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. సాగుచేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారం రోజులుగా కోహీర్ మండలంలోని సిద్ధాపూర్తండా, పిచర్యాగడి శివారులో జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్, కోహీర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా గంజాయి సాగు చేసినా, అక్రమ రవాణా చేసినా, సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు చెబుతున్నారు.
జహీరాబాద్ డివిజన్ కర్ణాటక సరిహద్దులో ఉండడంతో గంజాయి స్మగ్లర్లు వానకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేసి సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది. జహీరాబాద్‌లో గంజాయి సాగు భారీగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా ఎక్సైజ్ పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి జహీరాబాద్ ప్రాంతంలో నిల్వ చేయడం, అనంతరం కర్ణాటక, మహారాష్ర్టాలకు తరలిస్తున్నా తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గత ఏడాది జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలంలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేసి సాగు చేస్తున్న వారిని అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి.
రాష్ట్ర సరిహద్దులో గంజాయి సాగును నివారించేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్ జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, పట్టణ సీఐ రాజశేఖర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగును పూర్తిగా నివారించేందుకు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్ పట్టణ, రూరల్, చిరాగ్పల్లి, కోహీర్, ఝరాసంగం, హద్నూర్, రాయికోడ్ పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి సాగును అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. సాగుతోపాటు ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు 65వ జాతీయ రహదారి పై నిఘా ఏర్పాటు చేశారు.
జహీరాబాద్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చేపడుతున్నట్లు సమాచారం ఉండడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. కోహీర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సిద్ధాపూర్ తండా, పిచెర్యాగడి గ్రామాల్లో అంతరు పంటగా గంజాయి సాగు చేస్తుండడంతో దాడులు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నాం. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్ పట్టణ, రూరల్, చిరాగ్పల్లి. కోహీర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా గంజాయి సాగు చేసినా, గంజాయి అక్రమ రవాణా చేసినా 9490617012 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.