
వెల్దుర్తి, జూన్ 25. ఆడపిల్లల పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్షా 116 అందించి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని 67 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్దిదారులకు చెక్కులను ఎంపీపీ స్వరూపనరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లలు పెళ్లిళ్లకు నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మొదటగా రూ. 51 వేలతో ప్రారంభించి రూ. 75 వేలకు పెంచిన సీఎం, ఎవరూ అడగకుండానే రూ. లక్షా 116 అందిస్తున్నారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ యావత్ దేశంలోనే ఆదర్శంగా నిలస్తున్నారని అన్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని, త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను సైతం మంజూరు చేయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన పానుగంటి రామయ్య, సునీత దంపతులు అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుమార్తెలు విజయ, పూర్ణిమ, వనజ, శైలజలు అనాథలుగా మారారని, వారిని ఆదుకోవాలని సర్పంచ్ అశోక్‌రెడ్డి ఎమ్మెల్యేకు విన్నవించగా, అనాథలుగా మారిన ఆడపిల్లలను అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నర్సాపూర్-వెల్దుర్తి ప్రధాన రహదారి నుంచి పంతులపల్లి గ్రామానికి బీటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని బస్వాపూర్ సర్పంచ్ మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో పంతులపల్లి గ్రామస్తులు కోరగా పంతులపల్లి, హక్కీంపేట గ్రామాలకు రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరు చేయించి రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వెల్దుర్తి, మాసాయిపేట తహసీల్దార్లు సురేశ్, మాలతి, ఎంపీడీవో జగదీశ్వరాచారి, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు ఆహ్వానం…
వెల్దుర్తిలో రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ మాడేళ్లేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం సంఘం సభ్యులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేశారు. జూలై 5నుంచి మూడు రోజులు నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కోరారు.