
మెదక్ మున్సిపాలిటీ/సిద్దిపేట అర్బన్, జూలై 20 : కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. వారిలో వచ్చిన కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, వాటికి సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేపట్టే వారి నుంచి 2021-22 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థుల్లో రూపకల్పనలను ప్రేరేపించేలా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పాఠశాలలు, కళాశాల స్థాయిలోని విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్‌లు, వ్యవసాయదారులు, మహిళలు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రోత్సహించడం కోసం 2019-20 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ విభాగం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది (మూడోసారి) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తులు వాట్సాప్ ద్వారా..
ఇంటింటా ఇన్నోవేషన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారు ఇంటర్నెట్లో ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా వారి ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ఏదైనా ప్రాజెక్టును వివరాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. తమ ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వాక్యాలు రెండు నిమిషాల వ్యవధితో ఉన్న వీడియో, ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. ఆవిష్కరణలను రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ పరిశీలించి జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలను ఎంపిక చేస్తున్నది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లాలో వచ్చిన వాటిలో ఉత్తమ ప్రదర్శలను ఎంపిక చేస్తారు. స్వాతం త్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇందులో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు. గతేడాది రామాయంపేటకు చెందిన స్వా మికి రాష్ట్ర స్థాయిలో ప్రశంసా పత్రం లభించింది.
సిద్దిపేట జిల్లాకు చెందిన వారు 9100678543 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సిద్దిపేట జిల్లా విద్యాధికారి రవికాంతారావు తెలిపారు. మరిన్ని వివరాలకు సిద్దిపేట జిల్లా సైన్స్ అధికారి మహేందర్, 99495 60565ను సంప్రదించాలన్నారు.
ప్రతిభను వెలికి తీసేందుకే..
ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రతిభను వెలికి తీసేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యకమం నిర్వహిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలతో ప్రతిభ చాటేందుకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి. మంచిగా కనబరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. చదువుకున్న వారు, చదువుకోలేని వారు, ఏ రంగంలోని వారైనా ఇందులో పాల్గొనవచ్చు. వివరాలకు 832859915ను సంప్రదించండి.
-రాజిరెడ్డి, మెదక్ జిల్లా సైన్స్ అధికారి