
గజ్వేల్, జూలై 13 : రైతులకు ఎల్లప్పడూ ఎరువులు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎరువుల విక్రయాల్లో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రైతులకు వానకాలం పంట సాగుకు నెలరోజుల ముందుగానే ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో డీలర్ల వద్ద ఎరువులు అవసరమైన మేరకు ఉన్నా ముందస్తు జాగ్రత్తగా డీసీఎంఎస్ ద్వారా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్, అందోల్, నారాయణ్ఖేడ్తోపాటు సిద్దిపేట, గజ్వేల్ల్లో కూడా డీసీఎంఎస్ ద్వారా ఎరువులను అందుబాటులో ఉంచింది. ఈ ఎరువులను డీసీఎంఎస్ ద్వారానే నేరుగా రైతులకు విక్రయిస్తున్నది. ప్రభుత్వమే ఎరువులు విక్రయిస్తుండడంతో డీసీఎంఎస్ ఎరువుల విక్రయ కేంద్రాల్లో మార్కెట్ ధర కన్నా తక్కువకే రైతులకు దొరుకుతున్నాయి. ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలోని డీసీఎంఎస్ ఎరువుల విక్రయ కేంద్రంలో 90 టన్నుల యూరియా, 30 టన్నుల 20:20 ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నది. మరిన్ని సేవలందించడానికి జిల్లా కో-ఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ద్వారా కూడా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విక్రయ కేంద్రాల్లో మార్కెట్లో కన్నా తక్కువ ధరకు రైతులకు వివిధ రకాల ఎరువులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.