టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని హజ్రత్ షాహిద్ అల్లా దర్గా ఉర్సు ఉత్సవాలను ఈ నెల 23వ తేదీన (శుక్రవారం) నిర్వహించనున్నట్లు మాజీ కో ఆప్షన్ సభ్యుడు మజార్ తెలిపారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హసేని హుసేని ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దర్గాను రంగు రంగుల విద్యుత దీపాలతో అందంగా అలంకరించారు. దేవునికి మానవులందరు సమానులే అని హజ్రత్ షాహిద్ అల్లా ఖాద్రి చాటి చెప్పారని తెలిపారు.
ప్రతి సంవత్సరం సంప్రదాయంగా ఉర్సు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. టేక్మాల్ కింది వీధి నుంచి గంధం, చాదర్ ను ప్రత్యేక ప్రార్థనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పిస్తారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. వేడుకలను వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.