సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారి ఇంట్లో ఇద్దరు మహిళలు పనిలో చేరారు. రెండు రోజుల తర్వాత అదును చూసి ఇంట్లో ఉన్న వృద్ధుల కండ్లలో కారం కొట్టి 150 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 200 సీసీ కెమెరాలను విశ్లేషించి, నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. ముంబైలో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 120 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ముంబై, మహారాష్ట్ర నగర్ హాట్స్‌కు చెందిన మహ దేవి రాజేశ్ కలాల్ అలియాస్ సునీత, పూజ సురేశ్ సాగత్ ఇండ్లలో పనిచేస్తుంటారు. వీరిద్దరు పాత నేరస్తులు. కాగా ఈ నెల 2వ తేదీన ఎస్ఆర్నగర్ శాంతి బాగ్ లేన్‌లో నివాసముండే బి.రామ్ నారాయణ ఇంటికి వెళ్లిన సునీత పని చేస్తామంటూ అడిగింది. వెంటనే ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకుండానే పనిలో పెట్టుకున్నారు. అదేవిధంగా పూజ సురేశ్ మరొకరి ఇంటికి వెళ్లి పని చేస్తానంటూ అడిగింది, వారు ఆమె ఆధార్ కార్డు, గతంలో పనిచేసిన వివరాలు, సొంత ఊరెక్కడ అని అన్ని వివరాలు అడిగారు, ఆమె చెప్పిన సమాధానాలు సరిగ్గా లేకపోవడంతో ఆమెను పనిలో పెట్టుకోవడానికి నిరాకరించారు. ఈ క్రమంలో పూజ సురేశ్ కూడా తిరిగి సునీత పనిచేస్తున్న చోటకు వచ్చింది. పనిలో చేరిన మరుసటి రోజు 3వ తేదీన ఇంట్లో యజమాని తల్లిదండ్రులు వృద్ధులు మాత్రమే ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు కూడా బయటకు కనిపిస్తుండటంతో ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు యజమాని తల్లిదండ్రుల కండ్లలో కారం చల్లి అక్కడి నుంచి పరారయ్యారు.
పాత నేరస్తుల జాబితాలో..
కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు నిందితులకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. ఈ కేసును ఛేదించేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటన స్థలికి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. నిందితులకు సంబంధించిన సమాచారం సీసీ కెమెరాల ద్వారా సేకరించి, వారి గురించి నేరస్తుల డాటాబేస్‌లో పరిశీలించడంతో పాత నేరస్తులుగా తేలింది. దీంతో నిందితుల కోసం గాలించి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 120 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా ప్లాన్‌తోనే హైదరాబాద్‌కు
దొంగతనం చేయాలనే పక్కా ప్లాన్‌తోనే నేరస్తులు హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో తేలింది. పరిచయం లేని వాళ్లను పనిలో పెట్టుకోవడంతో దొంగతనం జరిగిందని, ఇంట్లో విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని సీపీ సూచించారు. ఈ నిందితుల వద్ద నుంచి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన రుబినా, అదిల్, ముజఫర్లు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రామ్‌ప్రసాద్, తదితర అధికారులు పాల్గొన్నారు.