బొల్లారం, ఫిబ్రవరి 18: వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకట్‌రెడ్డినగర్‌లో వివాహిత హత్య కేసును బొల్లారం పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. శనివారం బొల్లారం పోలీస్స్టేన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి నిందితుడిని ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న వివాహిత జ్యోతి (23) బొల్లారంలో దారుణ హత్యకు గురైంది. దీంతో బొల్లారం పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు జ్యోతి ఇంటి పరిసరాల్లో సీసీ ఫుటేజీ ఆధారంగా సాంకేతికత సహాయంతో కేసును ఛేదించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జ్యోతి ఇంటి నుంచి అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
మృతురాలు జ్యోతి కాల్ డేటా రికార్డును పరిశీలించగా ఆ వ్యక్తి ఆమె సొంత గ్రామం నారాయణపేట్ జిల్లా పరంపల్లికి చెందిన కుంటి బాలచందర్గా తెలిసింది. వీరిద్దరి మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. జ్యోతి తన భర్త లేని సమయం చూసి బాలచందర్‌ను ఇంటికి పిలిచింది. రాత్రి 11 గంటల సమయంలో జ్యోతికి ఫోన్ రావడంతో ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తూ బాలచందర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. కోపోద్రిక్తుడైన బాలచందర్ జ్యోతిపై పథకం ప్రకారం రాత్రి ఒంటిగంట సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు.
జ్యోతి ఫోన్ తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దారిలో సెల్‌ఫోన్, తాళం చెవిని నాలాలో విసిరేసి, అక్కడి నుంచి తప్పించకుని తిరుపతికి వెళ్లిపోయాడు. పోలీసులు వేగంగా విచారించి, నిందితుడు బాలచందర్‌ను మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరం చేసినట్టుగా అంగీకరించాడు. కష్టడిలోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును 48 గంటల్లోనే ఛేదించిన బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జిన్నారం సీఐ వేణుకుమార్, ఎస్సైలు వెంకట్‌రెడ్డి, విజయ్‌కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.