నర్సాపూర్,ఆగస్టు 24: రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని చాముండేశ్వరి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్ల పెంపునకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని, పాత పింఛన్లు పెంచడం లేదని మండిపడ్డారు.
పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్9న హైదరాబాద్లో మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. కొత్తగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్రంలో 60 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పెంచడం జరిగిందని, వారిని చూసి నేర్చుకోవాలని చురకలంటించారు. ఇప్పటి వరకు 75 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పింఛన్ల పెంపు కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.