శివ్వంపేట, నవంబర్ 24: ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి బైక్‌కు నిప్పుపెట్టిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడురులో చోటుచేసుకున్నది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గూడురు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఈఎంఐ పద్ధతిలో బైక్‌ను కొనుగోలు చేశాడు. ఐదారు నెలల ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది.
ఈ బకాయి కోసం ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు శనివారం ఇంటికి వచ్చి ఫైనాన్స్ చెల్లించాలనడంతో మనోవేదనకు గురైన ఆ వ్యక్తి ఆగ్రహంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల ముందే బైక్‌కు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ విషయంలో పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.