పాపన్నపేట, ఫిబ్రవరి14: జాతర సమీపిస్తున్నందున ఈనెల 17వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలసి ఏడుపాయల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. గుడి ప్రాంగణం పరిశీలించి, పరమశివుడి విగ్రహ ఏర్పాటుకు బండరాళ్లపై వేసే స్టేజి పటిష్టంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచనల మేరకు మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఏడుపాయల జాతరకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా నలుమూలల నుంచేగాక పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో దుర్గా భవానీ మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తారన్నారు.
వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించామన్నారు. ఈనెల 17 నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ లోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్ స్థలాలు, స్నానఘట్టాలు, వాటికల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వీఐపీల రాక, భక్తుల దర్శనం క్యూలైన్లు, ప్రసాదం క్యూలైన్, చెప్పుల స్టాండ్ వంటి ప్రాంతాల్లో పోలీసు శాఖ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మెదక్ ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట సీఈవో శైలేశ్, ఆర్డీవో సాయిరాం, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ సైదులు, ఆలయ ఈవో సార శ్రీనివాస్, చైర్మన్ బాలాగౌడ్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు రజని, సర్పంచ్ సంజీవరెడ్డి ఉన్నారు.
ఆలయం హుండీ ఆదాయం రూ.20.45 లక్షలు
ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయ హుండీ ఆదాయం రూ.20 లక్షల 45వేల 746లు సమకూరినట్లు ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం గోకుల్‌షెడ్‌లో భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో 26 రోజుల హుండీ లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో బంగారు, వెండి వస్తువులు మినహా నగదు రూపేనా రూ.20 లక్షల 45 వేల 746ల ఆదాయం సమకూరినట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో భ్రమరాంబిక, రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యురాలు సునీతారెడ్డి, ధర్మకర్తలు మనోహర్, మోహన్‌రావు, వెంకటేశం, పెంటయ్య, సాయిలు, యాదయ్య, బాగారెడ్డి, చక్రపాణి, నాగభూషణం, సిద్ధయ్య, సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, రవి, నర్సింలు, యాదగిరి, మహేశ్, నరేశ్, సూర్యశ్రీనివాస్, శ్రీనివాస్‌శర్మ, శంకర్‌శర్మ, సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.