సిద్దిపేట టౌన్, జూలై 7 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది.ఆషాడ మాసం మొదటి వారంలో సిద్దిపేట బురుజు మైసమ్మకు భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా బోనాల మనోత్సవాన్ని ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి బొట్టు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జోగిని భవిష్యవాణి వినిపించింది. అంతకుముందు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. బీఆర్ఎస్ మహరాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్ దీప్తీ నాగరాజులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్స వ కమిటీ వారు భక్తులకు ఆలయ ఆవరణలో అన్నదానం చేశారు.