జహీరాబాద్, ఏప్రిల్ 24: భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, ఆర్టీసీ, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి యూనిట్‌కు శంకుస్థాపన చేసి, ఎలక్ట్రిక్ ఆటోను స్వయం గా మంత్రి నడిపించారు. తెలంగాణ ప్రభుత్వం మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు. దేశంలోనే తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి కేంద్ర బిందువుగా మారాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా వారికి తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ప్రభుత్వం 15 రోజుల్లో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నదన్నారు. టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 23వేల పరిశ్రమలు స్థాపించి, మూడు లక్షల 30వేల పెట్టుబడులు పెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు స్థాపించి, 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. కొత్తగా వచ్చే కంపెనీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామికవేత్తలు పెద్దపీట చేసి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని యువత కోసం ప్రభుత్వపరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. రూ.వెయ్యి కోట్లు పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
Medak3
ఎలక్ట్రిక్ వాహనాలు హైదరాబాద్, గ్రామీణ, విదేశీ రోడ్లపై నడిచే అవకాశం ఉందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు, అదుపులో ఉండి రాజకీయ స్థిరత్వం ఉండాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు. దేశంలోనే తెలంగాణ పారిశ్రామిక పాలసీలో ఉత్తమంగా ఉందన్నారు. ప్రైవేట్ రంగాల్లో పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. జహీరాబాద్‌లో ఉన్న నిమ్జ్, మహీంద్రాలో స్థానిక, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. స్థానిక యువతకు 80,90 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తొమ్మిదేండ్లలో లక్షల ఉద్యోగాలు కల్పించిందన్నారు. కాలు ష్యం లేని వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. బ్యాటరీ, వాహనాలు తయారు చేసేందుకు ముం దుకు వస్తున్నారన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల రేస్ హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. ఆర్టీసీ, మెట్రోస్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తామన్నా రు. జహీరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమశాఖ ముఖ్యకార్యదర్శి జయశ్‌రంజన్, మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ సీఈవో సుమిత్రమిశ్రా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు, బీఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌కు మహీంద్రా వరం..
– మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశం బాగుపడాలంటే వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి ఉండాలన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయం, పరిశ్రమలకు ప్రోత్సహిస్తున్నారన్నారు. నిమ్జ్‌లో భారీ పరిశ్రమ ఏర్పాటు కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు. కార్మికులు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేశంలోనే ఇంత పెద్ద పరిశ్రమ ఎక్కడా లేదన్నారు.