నారాయణఖేడ్, జూన్ 22: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తారని, అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ చేతిలో మరోసారి మోసపోవద్దని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ, నోటీసులు ఇస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.15 వేలు రావాల్సిన రైతుబంధు రూ.12 వేలకు తగ్గిందని, అది కూడా రెండు విడతలు ఎగ్గొట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనేక ఆంక్షలు, కోతలతో రైతులకు ఇస్తున్నారన్నారు. గత రెండు పంటలతో కలిపి మొత్తం మూడు పంటల రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌కు స్వస్తిపలికి కోతల కరెంట్ సరఫరా చేస్తుందని, అరకొరగా పంట రుణమాఫీ, అందని సన్నధాన్యం బోనస్ డబ్బులు ఇలా రైతులను నష్టపర్చే విధంగా రేవంత్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. నారాయణఖేడ్ నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకం, కొత్తగా నిర్మించాల్సిన ఎనిమిది కొత్త చెరువుల పనులను కొనసాగించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న డ్రామాల కారణంగా పేదల బతుకు ఇల్లు పీకి పందిరేసినైట్లెందని ఎద్దేవా చేశారు. యువతను మభ్య పెట్టేందుకు రాజీవ్ యువవికాసం పేరుతో రుణాలు ఇస్తామని చెబుతున్నా ఇప్పటి వరకు ఏఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదని, యువకులు మోసపోయి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారం చేపట్టిన తర్వాత విస్మరించిన కాంగ్రెస్ నాయకుల తీరును యువత గురుంచుకోవాలన్నారు. మహిళలకు రూ.2500, వడ్డీలేని రుణం, కల్యాణలక్ష్మితో తులం బంగారం, వృద్ధు లు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ పేరిట ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి సుపరిపాలన అందించిన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటకువస్తారన్నారు. సమావేశంలో నాయకులు రవీందర్‌నాయక్, ముజామిల్, పార్శెట్టి సంగప్ప, లక్ష్మణ్‌రావు, జగదీశ్వర్‌చారి, వెంకటేశం, మల్గొండ పాల్గొన్నారు.