దుబ్బాక, జనవరి 19: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం.. ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. అరకొర బస్సులు, వచ్చిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీతో సమస్యగా మారింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు మగవారికి మరింత సమస్యగా మారింది.
దుబ్బాక బస్‌డిపోలో 34 బస్సులు ఉన్నాయి. ఇందులో 8 అద్దె బస్సులు ఉండగా, 12 రూట్లలో బస్సులను కొనసాగిస్తున్నారు. అత్యధికంగా దుబ్బాక-సిద్దిపేట రూట్లో 5 ఆర్డీనరీ బస్సుల ద్వారా రోజుకు 35 ట్రిపులు, 6 ఎక్స్‌ప్రెస్ బస్సుల ద్వారా 12 ట్రిపులు కొనసాగుతున్నాయి. దుబ్బాక-సికింద్రాబాద్ (జేబీఎస్) 6 బస్సులు రెండు ట్రిపులు చొప్పున, దుబ్బాక -బీబీపేటకు 4 బస్సులు, దుబ్బాక-ముస్తాబాద్‌కు 2 బస్సులు, మిగిలిన బస్సులను గ్రామాల మీదుగా సిద్దిపేట, సిక్రింద్రాబాద్‌కు నడుపుతున్నారు. గతేడాది డిపో ఆదాయం 6.5 లక్షలు నగదు వచ్చేది. ప్రస్తుతం రూ.8లక్షలు వస్తున్నది. ఇందులో నగదు రూపంలో కేవలం రూ. 2లక్షలు, మిగిలినది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
సిద్దిపేట, జనవరి 19: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వచ్చిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది. సిద్దిపేట డిపో పరిధిలో 102 బస్సులు ఉన్నాయి. సిద్దిపేట డిపో నుంచి జేబీఎస్, హైదరాబాద్, కామారెడ్డి, వేములవాడ, మెదక్, హనుమకొండ రూట్లలో బస్సులు నడుపుతున్నారు. బీదర్ వెళ్లే రూట్లో 13 ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతుండగా, 7 బస్సులను సికింద్రాబాద్ జేబీఎస్ వరకు పరిమితం చేసింది. దీంతో జహీరాబాద్, పటాన్చెరువు, సంగారెడ్డి, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమురవెల్లి మల్లన్న జాతరకు గతేడాది 14 బస్సులు నడపగా, ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి ఉదయం విద్యార్థుల కోసం 15 బస్సులు నడుపుతుండగా, అందులో 2 బస్సులు నిలిపి వేశారు. చేర్యాల నుంచి ఈసీఐఎల్ రూట్లో వెళ్లే బస్సును రద్దు చేశారు. అనేక బస్సుల్లో మహిళా ప్రయాణికులు గొడవ పడుతున్నారు.
చేర్యాల, జనవరి 19: బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రానికి దశాబ్దాలుగా నడుస్తున్న బాసర బస్ సర్వీస్‌ను ఆర్టీసీ అధికారులు బంద్ చేసినట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా జనగామ నుంచి చేర్యాల మీదుగా సిద్దిపేట, రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్ నుంచి బాసరకు నడుస్తున్న బస్ సర్వీస్‌తో చేర్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్థికంగా నష్టపోతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఆదేశాల మేరకు జనగామ ఆర్టీసీ అధికారుల సదరు బస్ సర్వీస్ నిలిపివేశారు. జనగామ నుంచి బచ్చన్నపేట, చేర్యాల మీదుగా 18 బస్ సర్వీస్‌లు నిత్యం మూడు ట్రిప్పుల చొప్పున సిద్దిపేట టు జనగామకు నడిచేవి. ప్రస్తుతం 30కి పైగా బస్ సర్వీస్ ట్రిప్పులు కొనసాగుతుండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
హుస్నాబాద్, జనవరి 19 : హుస్నాబాద్ డిపో పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి మండలాలు ఉండగా, ప్రధానంగా కరీంనగర్, హుజూరాబాద్, జనగాం, హైదరాబాద్ రూట్లలో బస్సులు ఎక్కువగా నడిపిస్తున్నారు. డిపోలో మొత్తం 55 బస్సులు 27రూట్లలో నడుస్తున్నాయి. 33 బస్సులు ఆర్టీసీవి కాగా 22 బస్సులు ప్రైవేట్‌వి ఉన్నాయి. డిసెంబర్ 9వ తేదీ కంటే ముందు డిపో పరిధిలోని మొత్తం బస్సులు రోజూ 17వేల మందిని తమ గమ్యాలకు చేర్చేవి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశ పెట్టడంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. జనవరి రెండో వారానికల్లా ఈ సంఖ్య 30వేలకు పైగా ఉండడంతో బస్సు ప్రయా ణం ప్రయాసంగా మారింది.
రెండు నెలల నుంచి బస్ నడపడం చాలా కష్టంగా మారింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులు భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. నేను దుబ్బాక-సికింద్రాబాద్ రూట్లో బస్ నడుపుతాను. ఆ రూట్లో చాలా గ్రామాలుండడంతో ప్రతి చోట బస్ నిలుపాలి. ప్రయాణికులతో ఎంత శాంతంగా మాట్లాడినా ఫలితం ఉండడం లేదు. నేను డ్రైవింగ్ చేసే క్యాబిన్లోకి కూడా మహిళలు వచ్చి నిలబడి ప్రయాణిస్తున్నారు. మాకు పని భారం అధికమవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషం. ఇందుకు సరిపడా బస్సులు నడపడం లేదు. ఉన్న బస్సుల్లో అందరూ ఒక్కసారి ప్రయాణించాలంటే ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు దుబ్బాక నుంచి సిద్దిపేటకు అరగంటకు ఒకటి చొప్పున బస్ ఉండేది. ఇప్పుడు గంటకొకటి నడిపిస్తున్నారు. దీంతో గ్రామాలకు సమయానికి వెళ్లలేక పోతున్నాం.
గ్రామాల్లో విద్యార్థుల కోసం మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ఆ తర్వాత గ్రామాల్లోకి బస్సులు వస్తలేవు. రోజు బస్సులో ప్రయాణం చేసేటోళ్లకు మాత్రమే ఉపయోగకరంగా ఉంది. కానీ ఊర్లో ఉన్న మాలాంటి వారు బస్సులు రోజు ఎందుకు ఎక్కుతారు. అందుకే బస్సులను ఊర్లలోకి నడుపాలి. చిన్నకోడూరు పోదామని వచ్చిన కానీ బస్సులు లేవు. ఇక్కడున్న సార్‌ను అడిగితే పొద్దునే ఉంటుందని చెప్పారు. బస్సుల నడిపే టైమ్ కింద మీద చేసినారు. సమయానికి బస్సులు నడుపాలి.
ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులను నడుపుతున్నాం. పండుగలు, వారంలో రెండు నుంచి మూడు రోజుల పాటు ప్రయాణికు రద్దీ అధికంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిపోకు ఇప్పటికే మూడు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు వచ్చాయి. మరో 12బస్సులు కావాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపాం. కొత్త బస్సులు వస్తే డిపో పరిధిలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమతమ గమ్యస్థానాలకు చేరవేస్తాం.
గజ్వేల్, జనవరి 19: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో 66 బస్సులు ఉండగా, అందులో 28వరకు ప్రైవేటు బస్సులున్నాయి. రోజూ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో 24వేల కిలోమీటర్ల దూరం బస్సులు ఆయా రూట్లలో తిరుగుతున్నాయి. రోజూ సాయంత్రం ప్రజ్ఞాపూర్ బస్టాండ్ వద్ద అధిక సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో మరిన్ని సర్వీస్‌లను పెంచాలని ప్రయాణికులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు కోరుతున్నారు.