Breaking News | మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి వాళ్ల మృతదేహాలను వెలికితీశారు.
నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరుకావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ క్రమంలో కల్పనకు వేరే వ్యక్తితో రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. ఇటీవల పుట్టింటికి వచ్చిన కల్పన.. నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14న తమ కూతురు కనిపించడం లేదని కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ చెప్పులు, బైకులు కనిపించాయి. దీంతో వీళ్లిద్దరూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. రెండు రోజులు చెరువులో గాలించగా గురువారం ఉదయం ప్రేమికుల మృతదేహాలు లభించాయి.