(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిపై రేవంత్ ప్రభుత్వం చేయించిన దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి మేధావుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త, పాలసీ ఎనలిస్ట్ సంజయ బారు కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి సబితపై పోలీసుల దౌర్జన్యాన్ని తప్పుబట్టిన ఆయన రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నట్టు అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి ఈ ఒక్కసారికే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో జరిగిన ఫోన్ సంభాషణలో సంజయ బారు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనలో పరిస్థితులు ఏమీ బాగాలేవన్నారు. జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తే, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చి చెప్పారు.
మొన్న చాణక్య.. నేడు సంజయ బారు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ‘చాణక్య స్ట్రాటజీస్’ సర్వే ఇటీవల తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,810 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వేలో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. 40.7 శాతం ఓట్ షేర్‌తో బీఆర్ఎస్ ముందంజలో ఉండటం.. 37.1 శాతంతో కాంగ్రెస్ వెనుకబడటం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ 3.6 శాతం ఆధిక్యంలో ఉండటం తెలంగాణలో అధికార మార్పు దిశగా సంకేతాలు బలపడుతున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నట్టు సర్వే అభిప్రాయపడింది. ఇప్పుడు, కాంగ్రెస్ పాలనపై సంజయ బారు కూడా అసహనం వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమేనని పేర్కొనడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తున్నది.