మెదక్, మే 13(నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్ట్టపడి పండించిన వడ్ల్లను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా వారం, పదిహేను రోజులు గడుస్తున్నా కాంటా చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. తూకం సకాలంలో వేయడం లేదు. తూకం వేసినా లారీలు, హమాలీల సమస్యతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మూలుగుతున్నది. పౌరసఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 533 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉం డగా, 447 మాత్రమే ప్రారంభించారు. గతంలో 100 మిల్లులకు ధాన్యం తరలించేవారు. ప్రస్తు తం 58 మిల్లులకు వడ్లు తరలిస్తున్నారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు 600 లారీలు ఏర్పాటు చేశారు. ఇప్పుటి వరకు జిల్లాలో కేవలం 90.685 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సేకరించారు. 8326 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 96.42 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బస్తా 40.700 కిలోలు తూకం వేయాలి. కానీ, అదనంగా 3 కిలోలు తరుగు పేరిట తూకం వేసి రైతుల నుంచి తీసుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో 38 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 20 రా రైస్ మిల్లులకు ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నారు. మిల్లుర్లు ధాన్యం అన్లోడ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తరుగు, తేమ పేరుతో 3 కిలోలు అదనంగా తీసుకోవడంతో రైతులకు నష్టం జరుగుతున్నది. వడ్లకు ప్రభుత్వం ఏ-గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 చెల్లిస్తున్నది. ఈ సీజన్లో జిల్లాలో 4,45,46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నదని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మే నెలాఖరు నాటిని వడ్ల సేకరణ లక్ష్యం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు సుమారు 1000 లారీలు అవసరం ఉండగా, అధికారులు 600 లారీలో అందుబాటులో ఉంచారు. లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయి, రైతుల తెస్తున్న ధాన్యం తూకం వేయలేని పరిస్థితి ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల వద్ద 50 శాతం ధాన్యం నిల్వ ఉంది. మిల్లుర్లు, లారీల డ్రైవర్లు, యజమానులు ఇష్టారాజ్యంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
90.685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నం..
మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో 19,206 మంది రైతుల నుంచి 90.685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 8326 మంది రైతులకు రూ. 96.42 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు పరిశీలించి, వేగంగా ధాన్యం కొనేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నచిన్న సమస్యలు ఉన్నా లక్ష్యం మేరకు ధాన్యం సేకరిస్తాం.
– నిత్యానంద్, జిల్లా పౌరసరఫరాల అధికారి, మెదక్