కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 14 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆనంద నిలయం ఆవరణలో ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని దవాఖానలో పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. భారత మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురువారం ఈ దవాఖానను సందర్శించి ఎక్విప్మెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఈ దవాఖానలో ఉచితంగా గుండె ఆపరేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గుండె ఆపరేషన్ల కోసం ఇప్పటికే 30 మంది చిన్నారులను గుర్తించామని, ప్రతిరోజు 5 నుంచి 6 మంది చిన్నారులకు ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఇందుకోసం 100 పడకల దవాఖాన సిద్ధ్దంగా ఉన్నట్లు తెలిపారు. ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందిస్తామని, భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఈ దవాఖానకు సునీల్ గవాస్కర్ సందర్శించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంజీవని దవాఖాన సేవలు అభినందనీయం అన్నారు. సత్యసాయి ట్రస్ట్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆకాక్షించారు.