మెదక్,/ సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), ఫిబ్రవరి 2: కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో ఏండ్లుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. కొంతమంది సుమారు ఐదేండ్లు గా ఒకే సీటులో ఉండడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో వివిధ శాఖల్లో మూడేండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో, వరుసగా మూడేండ్ల సర్వీసు ఉన్నవారితో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, గతంలో జరిగిన ఎన్నికల్లో ఆరోపణలు, ఫిర్యాదులు ఎదురొన్న ఆఫీసర్లు, జూన్‌లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు ఇలా వివిధ జాబితాలను సిద్ధం చేయడంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో మూడేండ్లుగా కీలక పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితా రూపొందించడంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాథమికంగా లిస్ట్‌ను సిద్ధం చేశారు. దీనిపై పరిశీలన జరిపిన అనంతరం తుది జాబితా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు స్థానచలనం కలగనున్నది.
కేంద్ర ఎన్నికల సంఘం
రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అధికారుల బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్‌లోగా పదవీ విరమణ చేయనున్న వారిని జాబితాలోకి తీసుకోవడం లేదు. నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో అన్ని విభాగాల్లో భారీ ఎత్తున బదిలీ అయ్యాయి. మునుపటితో పోలీస్తే ప్రస్తుతం పెద్దగా బదిలీలు ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన వారిపై ఎన్నికల సంఘం క్రమ శిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తే అలాంటి ఉద్యోగులకు పార్లమెంట్ ఎన్నికల విధులు అప్పగించకుండా ఉండేలా ప్రణాళికలు తయారుచేస్తున్నారు. మొదటి వారంలోగా మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు అంతర్గత బదిలీలు, డిప్యుటేషన్లపై వచ్చిన వారిని వెనకి పంపడానికి సైతం యోచిస్తున్నారు. తాజా పరిణామాలపై కింది స్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి జిల్లాలో
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల బదిలీలు జరగనున్నాయి. ప్రధానంగా రెవె న్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల్లో ఒకేచోట మూ డేండ్లకుపైగా పనిచేస్తున్న అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. రెవెన్యూశాఖలో తహసీల్దార్ సహా ఆ స్థాయి అధికారులు 20 మంది, పోలీస్‌శాఖలో 25 మందికి పైగా సీఐలు, ఎస్ఐలు, ఎక్సైజ్‌శాఖలో 20 మందికిపైగా అధికారులు, 22 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లకు సంబంధించిన జాబితాను జిల్లాయంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిసింది.