పిల్లలకు ఇష్టమైన రోజులు వేసవి సెలవులు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దామనో, పిల్లల అభిరుచికి తగినట్లుగా దేనిలోనైనా శిక్షణ ఇప్పిద్దామనో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే.. వీటికంటే ముందు ఈ వేసవిలో ఓ ముఖ్యమైన పనిచేస్తే పిల్లల్లో చైతన్యం కలుగుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలను తెలియజేయడంతో వారిలో కొత్త మార్పు కనిపిస్తుంది. గత స్థితిగతులు ఎలా ఉండెనో వారికి రుచి చూపించాలి. దీని వల్ల పిల్లల ఆలోచనల్లో మార్పు వస్తుంది.
– చేర్యాల, మే 15
ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకుంటాం. అమ్మానాన్నలు ప్రయాస పడి మనల్ని ఉన్నత చదువులు చదివిస్తారు. కళాశాలకు డొక్కు సైకిల్ మీద వెళ్తాం. జేబులో చిల్లిగవ్వ లేకున్నా చదువును నెట్టుకొస్తాం. మంచి ర్యాంకులు సాధిస్తాం. తరువాత ఉద్యోగం సంపాదించి పట్టణాల్లో స్థిరపడుతాం. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు ఇక అంతే. కానీ.. మన మూలాలను క్రమంగా మర్చిపోతున్నాం. మనం పుట్టి పెరిగిన గ్రామం, చిన్ననాటి గురుతులను వదిలేస్తున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పలేకపోతున్నాం.
మానవ సంబంధాలను తెలియజేయాలి
ప్రసుత్త రోజుల్లో పిల్లలకు మానవీయ విలువలను పరిచయం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది. మన దగ్గరి బంధువుల ఆప్యాయతలను దగ్గరగా చూపించాలి. బంధువులు, పెద్దలతో ఎలా మాట్లాడాలి.. వారిని ఎలా గౌరవించాలనే విషయాలను నేర్పించాలి. అమ్మమ్మ, తాతయ్య, నాయినమ్మ, బాబాయిలు, మరిచిపోయిన పిలుపుల్ని మరువరాని పదాలుగా మార్చి చిన్నారుల్లో మానవ సంబంధాలను పరిచయం చేయాలి. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం పిల్లలకు తెలియజేయడం అవసరం. గ్రామాల్లో జరిగే జాతరలు, తిరునాళ్లు, పండుగలను ప్రత్యేకంగా పిల్లలకు చూపించాలి. వాటి విశిష్టతను వివరించడంతోపాటు మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమను తెలియజేయాలి.
పిల్లలకు కష్టం విలువ తెలియజేయాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ బాల్యం ఎలా గడిచింది.. పడ్డ బాధలు, ఎదుర్కొన్న కష్టాలు, జీవిత ఆటుపోట్ల గురించి తెలియజేయాలి. ఏదో పాఠం చెప్పినట్లు కాకుండా వారిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి మన జీవిత స్థితిగతులను అనుభవ పూర్వకంగా వివరించాలి. అప్పుడు తల్లిదండ్రులు పడిన బాధలు పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో గడుపుతున్న కుటుంబాలు, వారు చేస్తున్న వృత్తులను, భిన్నమైన జీవన విధానాన్ని ప్రత్యేకంగా పిల్లలకు చూపించాలి. ఎక్కడైతే మీ అడుగులు ప్రారంభమయ్యాయో అక్కడి నుంచి ప్రస్తుతం మీరున్న స్థితికి చేరేందుకు పడిన కష్టాలు, చదువుకున్న బడి, మిమ్మల్ని ప్రోత్సహించిన గురువులు, వ్యక్తులను పిల్లలకు పరిచయం చేసినప్పుడే వారిలో మంచి భావన పెరిగి సమాజం పట్ల గౌవరం పెరుగుతుంది.
పల్లెటూరి మట్టి వాసన రుచి చూపించాలి
నిరంతరం ఇల్లు, బస్సు, బడి. అప్పుడప్పుడు యాత్రలు.. ఇదీ నగర జీవనం. కనీసం ఈ సెలవుల్లోనైనా పల్లెటూరిలోని పచ్చని చెట్లు, గుట్టలు, చెరువులు, పంట పొలాల్లోని మాధుర్యాన్ని, గ్రామాల్లోని వృత్తులను, భిన్నమైన జీవన విధానాన్ని ప్రత్యేకంగా పిల్లలకు చూపించి వారి మానసిక స్థితిలో వచ్చే మార్పును ప్రత్యక్షంగా గమనించాలి.
సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలి
వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను కొన్ని రోజులపాటు సరదాగా సొంత ఊరిలోకి తీసుకెళ్లాలి. పల్లెలకు వెళ్లడం వల్ల సంస్కృతి, సంప్రదా యాలు, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు, తల్లిదండ్రులు, రైతుల కష్టాలు, బంధాలు, బంధుత్వాలు తెలుస్తాయి. గ్రామాల్లో జరిగే సంప్రదాయ పండుగలు, పబ్బాల ప్రాముఖ్యతను, గ్రామీణ స్థితిగతులను తెలియజేయాలి.
– మంగళగిరి శేషాచార్యులు, విశ్రాంత ఉపాధ్యాయుడు, చేర్యాల