సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 9: అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో రాబోతున్న ఫార్మా విలేజ్, లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల రైతులు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఫార్మా విలేజ్ మాకోద్దని నినాదాలు చేశారు.
కలెక్టర్ వచ్చేవరకు కదిలేది లేదని మొండికేశారు. డీఎస్పీ సత్యనారాయణ వారించినా వారు వినలేదు. దీంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడికి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తామని చెప్పారు. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు మాట్లాడుతూ న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డీ గ్రామా ల్లో భూమిని సేకరించేందుకు వీల్లేదన్నారు.
భూసేకరణ చట్టం 2013 ప్రకారం రాష్ట్రంలో 90శాతం భూమి సాగుకు పనికిరాని, 10శాతం భూమి సాగుకు అనుకూలమైన భూమిని సేకరించవచ్చని, అయితే న్యాల్కల్ మండలంలో అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నదన్నా రు. ఫార్మా సిటీ కోసం ప్రతిపాదించిన 2003 ఎకరాల్లో 1702 ఎకరాలు, అంటే దాదాపు 85శాతం సాగుకు అనుకూలంగా భూమి ఉన్నదని వివరించారు. ఇందు లో 15శాతం 301 ఎకరాలు మూడు పంటలు పండే భూమి ఉన్నదని పేర్కొన్నారు.
భూసేకరణ చట్టం 2013కు వ్యతిరేకంగా గ్రామ సభలు పెట్టకుండా పంచాయతీ కార్యాలయంలో నోటీసులు అతికించడం సరికాదన్నారు. ఇక్కడ ఫార్మాసిటీ నిర్మిస్తే ఆయా గ్రామాల గుండా కాలుష్యం నీరు ప్రవహించి మంజీరా ద్వారా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకూ ప్రమాదం పొంచి ఉన్నదని వాపోయారు. ఇప్పటికే పిరమల్ ఫార్మా కంపెనీ కాలుష్యం బాధలు అనుభవిస్తున్నామని, కొత్తగా ఫార్మా కంపెనీలు పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
భూమిని నమ్ముకొని బతుకుతున్నామని, తమ బతు కు తెరువు మీద దెబ్బకొట్టవద్దని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామని, వ్యవసాయంతోపాటు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపకంతో జీవనం సాగిస్తున్నామని చెప్పారు. భూమి, నీరు, గాలిని కలుషితం చేసి కాలుష్యం కొరల్లోకి తమను నెట్టే ఫార్మా సిటీకి భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన భూమి గుండా తమకు తాగు,
సాగునీరు అందించే చెరువు, చాకలి వాగు, కోట వాగు, నక్కల, న్యాల్కల్ వాగులు ఈ గ్రామాల గుండా వెళ్లి చెనెగపల్లి ప్రాజెక్టు ఎగువన కలుస్తాయని పేర్కొన్నారు. ఫార్మాసిటీతో శాశ్వతంగా భూ ములు కోల్పోవడంతోపాటు బోరు బావులు పోతాయని, తమ జీవితాలు రోడ్డు పాలవుతాయని, వెంటనే ఫార్మా కంపెనీల నిర్మాణ ప్రతిపాదనలు విరమించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రైతు సంఘం నాయకులు జయరాజు, మాణిక్యం, ఆయా గ్రామాల నాయకులు, రైతులు రవీందర్, రవికుమార్ తదితరులు పా ల్గొన్నారు.
ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి. మా భూములు కంపెనీలకు ఇస్తే మేము ఎట్ల బతికేది. పంట పొలాలను సాగు చేసుకుంటేనే జీవిస్తున్నాం. భూములు లాక్కుంటే మేము, మా పిల్లల పరిస్థితి ఏమిటీ. డప్పూర్లో 1503 ఎకరాలు, మల్గి, వడ్డీ గ్రామాల్లో 250 ఎకరాల చొప్పున భూమిని తీసుకుంటే.. ఇక్కడి ప్రజలు ఎక్కడికి పోవాలే. న్యాయంగా ఆలోచించి ఆ కంపెనీలను రాకుండా చూడండి.
– ముత్తమ్మ, మహిళా రైతు, డప్పూర్
మేము ఐదుగురు అన్నదమ్ములం. మా అందరికి కలిపి దాదాపు 16 ఎకరాల భూమి ఉన్నది. ఫార్మా కంపెనీలతో మా అందరి భూమి పోతే.. మేము ఎక్కడికి పోవాలే. భూమే మా జీవనాధారం. మా భూమి కంపెనీకు ఇస్తే ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డట్టే. ప్రభుత్వం దయచేసి మా భూముల జోలికి రావద్దు.
– ఏసప్ప, రైతు, డప్పూరు
డప్పూర్లో నాకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. ఉన్న భూమి మొత్తం ఈ ఫార్మా కంపెనీలకు ఇచ్చి నేను, నా పిల్లలు ఏమి కావాలి. ఇప్పటికే ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి భూమిని సాగు చేసుకుంటున్నా. ప్రభుత్వం భూమి గుంజుకుంటే నా పరిస్థితి దయనీయమే. నా కుటుంబం రోడ్డున పడుద్ది. ప్రభుత్వం దయ ఉంచి మా భూములు తీసుకోవద్దు.
– భీమ్గొండ, రైతు, డప్పూర్
మా గ్రామంలో సర్వే నెంబర్ 193లో నాకు 3.35 ఎకరాల భూమి ఉన్నది. ఫార్మా సిటీలో ఆ భూమి పోతుందంటే తట్టుకోలేకపోతున్నా. నా కుటుంబాన్ని ఎట్లు బతికించుకోవాలో ఆలోచిస్తేనే భయమేస్తుంది. ప్రభుత్వం మొండిగా రైతులు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మా భూములు పోకుండా ఎంత వరకైనా పోరాడుతాం.
– తుకారాం, రైతు, డప్పూరు