సిద్దిపేట, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ప్లాట్ల విలువలు, చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది. గతంలో రోజుకు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. సరాసరి ఒక్కో కార్యాలయంలో ఐదు నుంచి 10 మధ్యనే అవుతున్నాయి.
మరికొన్ని కార్యాలయాల్లో ఐదు లోపలే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అవి కూడా ప్రస్తుతం అత్యవసర అవసరాల కోసం చేసే మార్టిగేజ్ (తనఖా) రిజిస్ట్రేషన్లు తప్పా మిగతా లావాదేవీలు మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. భూమి కొనుగోలు చేసినప్పుడు మారెట్ విలువతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ తదితర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో లక్షల విలువైన స్థలాలపై వేల నుంచి లక్ష వరకు అదనపు భారం పడుతోంది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని మండల తహసీల్ కార్యాలయాలతో పాటు పట్టణ కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనుగోలుదారులు, విక్రేతలతో కిటకిటలాడేవి. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిన నాటి నుంచి పరిస్థితి భిన్నంగా ఉంది. భూముల విలువలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రధాన రహదారుల సమీపంలో ఉన్నవి 80 శాతం, మిగతావి 50 శాతం వరకు భూములు, ప్లాట్ల ధరలు పెరిగాయి. దీంతో కొద్ది మంది మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుకు వచ్చిన వారు కూడా పెరిగిన చార్జీల కారణంగా తమ నిర్ణయాలను వాయి దా వేసుకుంటున్నారు. చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గాయి.
గురువారం నుంచి అమలులోకి రాగా ఈ ఆరు రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని ఐదు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 391, మండలాల్లో 673 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు సరాసరి 40 నుంచి 50 మధ్యన అయ్యేవి. ప్రస్తుతం సరాసరి రోజుకు 10 నుంచి 12 మాత్రమే అవుతున్నాయి. ఇక మండల కార్యాలయాల్లో రోజుకు సరాసరి 15 నుంచి 20 అయ్యేవి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు అవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఖాతా కూడా తెరవడం లేదు. అధికారులు ఖాళీగానే కూర్చుంటున్నారు. సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 85, అర్బన్‌లో 75 మాత్రమే అయ్యాయి.
చిన్నకోడూరు 32, నంగునూరు 50, నారాయణరావుపేట 6, సిద్దిపేట రూరల్ 6, సిద్దిపేట అర్బన్ 56, హుస్నాబాద్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52, మండలాల్లో చూసుకుంటే హుస్నాబాద్ 30, అక్కన్నపేట 35, కోహెడ 22, బెజ్జంకి 13, దుబ్బాక సబ్ రిజిస్ట్రేషన్‌లో 19, దుబ్బాక మండలంలో 24, అక్బర్పేట-భూంపల్లి 12, మిరుదొడ్డి 20, తొగుట 13, దౌల్తాబాద్ 18, రాయపోల్ 25, గజ్వేల్ సబ్ రిజిస్ట్రేషన్‌లో 85 రిజిస్ట్రేషన్లు కాగా కుకునూరుపల్లి 12, కొండపాక 14, గజ్వేల్ 36, వర్గల్ 22, ములుగు 20, జగదేవ్‌పూర్ 50, మర్కూక్ 48, చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్‌లో 75, చేర్యాల మండలంలో 38, ధూళిమిట్ట 25, కొమురవెల్లి 23, మద్దూరులో 23 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదే విధంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు.
వ్యాపార అవసరాలు, బ్యాంకు రుణాల కోసం భూములను తనఖా పెట్టే మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతున్నాయి. ఎందుకంటే రుణాల కోసం ఇవి తప్పనిసరి. కానీ, కొత్త కొనుగోళ్లు, గిఫ్ట్ డీడ్లు, సేల్ డీడ్లు, విభజన రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాట్లు, వ్యవసాయ భూములు, నివాస స్థలాల కొనుగోళ్లు తగ్గడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు ధరలు తగ్గే వరకు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. రైతులు, సామాన్యులపై ప్రభావం పడింది.
అత్యవసర అవసరాల కోసం భూమి విక్రయించాలనుకునే రైతులకు కొనుగోలుదారులు దొరకడం కష్టమవుతోంది. ఒకవైపు వ్యవసాయ సంక్షోభం, మరోవైపు పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చులు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కుటుంబ అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్యులు కూడా వెనుకడుగు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పునఃసమీక్షించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే భూముల కొనుగోలు విక్రయాలు మరింత మందగించి రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ప్రభుత్వ ఆదాయం పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
గజ్వేల్, జూన్ 12: ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో రైతులపై అదనపు భారం పడుతున్నది. మర్కుక్ మండలంలో పెంచిన భూముల విలువతో రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వం భూముల విలువను ఆరు నెలల ముందుగా పెంచితే రీజినల్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఎక్కువగా వచ్చేది. ప్రభు త్వం భూములకు ధర నిర్ణయించిన తర్వాత విలువ పెంచడంతో బాధిత రైతులకు నష్టం జరిగింది. ప్రతి గ్రామంలో భూములు విలువ రూ.10లక్షలకు పెంచింది. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న తనకు ఇప్పుడు పెంచిన ధరలతో నష్టపోయాను. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు.
-మందాల మహేందర్‌రెడ్డి, నర్సన్నపేట (సిద్దిపేట జిల్లా)
మిరుదొడ్డి, జూన్ 12 : ప్రభు త్వం రిజిస్ట్రేషన్ చార్జీలు అధికంగా పెంచిం ది. గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గాయి. పేదలు భూములు కొని రిజిస్ట్రేషన్ చేయి ంచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి తమ ఖజానా నింపుకోవడానికి పేద రైతుల కడుపు కొట్టడం సరైంది కాదు.
– తోట అంజిరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీఆర్ఎస్ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు (సిద్దిపేట జిల్లా)
దుబ్బాక, జూన్ 12:ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడింది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపల్‌తో పాటు దుబ్బాక, అక్బర్పేట-భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, తొగుట మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగి, మండలాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంగా ఉండటంతో దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర రాజధానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు.
దీంతో దుబ్బాక నియోజకవర్గంలో భూములకు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో దుబ్బాక నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలు రెండింతలు పెంచడంతో భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. ఇంతకుముందు రోజుకు తహసీల్ కార్యాలయంలో పది రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం రోజుకు మూడు, నాలుగు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
మెదక్, జూన్ 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు పెంచింది. మెదక్ మున్సిపాల్ పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల మార్కెట్ ధర గతంలో రూ. 5 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ. 14 కోట్లకు పెంచింది. ఆర్అండ్బీ రోడ్లకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల ధరలు గతంలో మార్కెట్ ధర రూ. కోటి ఉండగా, ప్రస్తుతం రూ. 3కోట్లకు పెంచింది. వ్యవసాయ భూముల ధర గతంలో రూ. 70 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 1.90 కోట్లకు, వర్షాధార వ్యవసాయ భూముల ధర గతంలో రూ. 11 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 36 లక్షలకు పెంచింది. మెదక్ జిల్లాలో ఇంటి స్థలం గజానికి మార్కెట్ ధర రూ. 2100 ఉండగా, ప్రస్తుతం రూ. 6800, కమర్షియల్ ప్లాట్లకు రూ.17600 ఉండగా, రూ. 22000 లకు పెంచింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి స్థలం రూ. 1700 ఉండగా ప్రస్తుతం రూ. 2600,కమర్షియల్ స్థలాలు రూ. 2100 ఉండగా, ప్రస్తుతం రూ. 3200లకు పెంచింది.