Brahmotsavalu | రామచంద్రాపురం, ఫిబ్రవరి 27: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెల గ్రామంలోని లక్ష్మీ అనంత పద్మనాభస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది స్వామివారి ఉత్సవాలతోపాటు బ్రమరాంభా మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు 20వేల వరకు భక్తులు హాజరయ్యే అవకాశమున్నదని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. 16, 17 వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఒగ్గు సుచరిత కొమురయ్య, పట్లోళ్ల రవీందర్రెడ్డి స్వామివారి కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
లక్ష్మీ అనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 6గంటలకు గోపూజ, వరుణపూజ, మూలమూర్తికి విశేష అభిషేకాలంకరణం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, ఆచార్యాది రుత్విక్వరణం, ధ్వజారోహణం, నాంది స్థాపనం, అంకురార్పణం, 10గంటలకు యాగశాల ప్రవేశం, అగ్నిస్థాపనం, గణపతిహోమం, నవగ్రహహోమం, బ్రహ్మాది దేవతా హోమాలు, విష్ణుహోమం, మహాలక్ష్మీహోమం, సుదర్శనహోమం, రాత్రి 7.25 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు గురువారం ఉదయం 8గంటలకు సామూహిక విష్ణు పంచాయతన హోమం, పవమాన హోమం, లక్ష్మీనరసింహ హోమం, సాయంత్రం 6గంటలకు మహా పుష్పయాగం, చతుర్వేద రాజోపచార సేవ.
మూడో రోజు శుక్రవారం తెల్లవారుజామున 4.21 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవం, ఉదయం 8గంటలకు చక్రతీర్థ స్నానం, 10గంటలకు మహా పూర్ణాహుతి, మహాదాశీర్వచనం, ఆచార్యాది సత్కారాలు, అదేరోజు ఉదయం 6గంటలకు బ్రమరాంభా మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 12గంటలకు స్వామివారి విగ్రహాలకు 108 పూర్ణ కుంభాభిషేకం, సాయంత్రం 5గంటలకు విగ్రహాలకి జలాదివాసం, ధాన్యాది వాసం, శయ్యది వాసం, ఫలాది వాసం, పుష్పాదివాసం, రాత్రి 8గంటలకు చతుర్విద రాజోపచార సేవ, తీర్థప్రసాద వితరణ. నాలుగో రోజు శనివారం ఉదయం 7.21గంటలకు యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ, విగ్రహ ప్రతిష్ఠ, విగ్రహాలకు సర్వాలంకరణ, సర్వదర్శనం, మహా పూర్ణాహుతి, బలిప్రదానం, 12గంటలకు మహదాశీర్వచం, ఆచార్య సత్కారం, తీర్థ ప్రసాద వితరణ. ఐదోరోజు ఆదివారం బోనాల ఉత్సవాలతో వేడుకలు ముగుస్తాయి.
వెలిమెల లక్ష్మీ అనంతపద్మనాభస్వామి ఆలయానికి సుమారుగా 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. నిజాం కాలంలోనే గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు. నాలుగు శతాబ్దాల క్రితం వెలిమెలలో విద్యావకాశాలు లేకపోవడంతో గ్రామపెద్దలు మేడ్చల్ ప్రాంతానికి చెందిన వెంకట్రెడ్డి పంతులుతో మాట్లాడి ఆయనను ఒప్పించి గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలో పాఠశాలతో పాటు ఆయనకు కావాల్సిన వసతి సౌకర్యాలు గ్రామపెద్దలు కల్పించారు. గ్రామంలోని చిన్నారులకు వెంకట్రెడ్డి పంతులు పాఠాలు బోధించేవాడు. ఆయన లక్ష్మీ అనంత పద్మనాభస్వామి భక్తుడు. ఏటా వికారాబాద్లో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు పంతులు కాలినడకన వెళ్లేవాడు. కాలక్రమేన వయస్సు మీదపడడంతో వృద్ధాప్యంలోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వెళ్లి స్వామి ఇదే నా చివరి రాక, ఇకమీదట నీ ఆలయానికి రాలేనేమోనని, వయస్సు మీదపడడంతో నడవలేని స్థితిలో ఉన్నానని స్వామివారికి తన బాధను చెప్పుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. వెంకట్రెడ్డి పంతులు కాలినడకన వస్తుంటే ఉన్నట్టుండి ఆయన మెడలో పూలమాల పడడంతో పాటు స్వామివారి సాలగ్రామం (విగ్రహం) దొరికింది. ఆ సాలగ్రామం తీసుకొని ఆయన గ్రామానికి వచ్చారు. ఇంట్లో సాలగ్రామం ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు పూజలు చేసేవారు. ఈ విషయం గమనించిన గ్రామపెద్దలు వెంకట్రెడ్డి పంతులుని అడగడంతో ఆయన వారికి జరిగిన విషయాన్ని వివరించారు. ఆ తర్వాత గ్రామపెద్దలు స్వామివారి ఆలయాన్ని నిర్మించి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టినప్పటి నుంచి గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తాడని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు ఈ యేడు బ్రమరాంభామల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఐదు రోజుల పాటు వేడుకలు వైభవంగా జరుగుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారాల దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న గ్రామస్తులు బ్రహ్మోత్సవాలకు ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్వామివారి కల్యాణమహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం.
– పట్లోళ్ల రవీందర్రెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్
స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఇప్పటికే స్వాగతతోరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ లైట్లు ఇతర ఏర్పాట్లు చేయించాం. వెలిమెలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
– సుచరిత కొమురయ్య, 16వ వార్డు కౌన్సిలర్