సిద్దిపేట, జూన్ 14 : సిద్దిపేట మున్సిపల్ ప్రజలకు సేవలు అందించడంలో అత్యాధునిక వసతులను కల్పించి అభివృద్ధిలో రాష్ర్టానికి మోడల్‌గా నిలిచింది. నేడు పట్టణాభివృద్ధి సిగలో స్లాటర్ హౌస్ వచ్చి చేరనున్నది. ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పురపాలక సంఘాల్లో స్లాటర్ హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట శివారులోని ఇర్కోడ్ వద్ద 2 ఎకరాల స్థలంలో రూ.6 కోట్లతో అధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కబేళాతో పాటు కప్పల కుంట, రూ.87.50 కోట్లతో మంచి నీటిసరఫరా పనులకు, రూ.20 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి హరీశ్‌రావు నేడు (గురువారం) ప్రారంభించనున్నారు.
సిద్దిపేట పట్టణం శివారులోని ఇర్కోడ్ వద్ద నిర్మించిన కబేళాతో ప్రజలకు నాణ్యమైన మాంసం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. సిద్దిపేట పట్టణంలో మాంసం, విక్రయించే వ్యాపారులు సుమారు 200 వరకు ఉంటారు. వీరికి గతంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో స్టాళ్లను కేటాయించారు. ఈ వ్యాపారులు ఇంతకు ముందు పట్టణంలోని చింతల్ చెరువు వద్ద నామమాత్రపు వసతులతో స్లాటర్ హౌస్‌ను వినియోగించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మాంసం కోసం గొర్రెలు, మేకలను వదించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో స్లాటర్ హౌస్‌ను నిర్మాణ పనులను మూడు ఏండ్ల కింద ప్రారంభించారు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 3 కోట్లు, పట్టణ ప్రగతి రూ.92లక్షలతో ఈ స్లాటర్ హౌస్ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాటు ఈ కబేళాలో సీసీ రహదారి,1.20 లక్షల సామర్థ్యం గల వాటర్ ట్యాం క్‌ను, ప్రహరీ, మరుగుదోడ్లు నిర్మాణ పనులు పూర్తి చేశారు. పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.1.30 కోట్లు వెచ్చించి ఆధునిక పద్ధ్దతిలో మాంసం వ్యర్థాలతో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఇఫ్లూమెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాంట్‌లో మాంసం వ్యర్థాలు, నీటితో పైప్‌లైన్ సహాయంతో కలెక్షన్ ట్యాంక్‌లోకి పంపి, అక్కడి నుంచి రెండు రియక్టర్లలతో అనరోబిక్ విధానంలో కుళ్లిపోయేలా చేయడం ద్వారా గ్యాస్ఉత్పత్తిని చేస్తారు. గ్యాస్‌ను బెలూన్‌లోకి పంపి ఒత్తిడికి గురి చేయడం ద్వారా వచ్చే కరెంట్‌ను జనరేటర్‌కు అనుసంధానం చేసి అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. అధునిక పద్ధ్దతుల్లో నిర్మించిన స్లాటర్ హౌస్‌లో మాంసంగా మార్చే ప్రక్రియ కోసం తుప్పు పట్టని స్టీల్ సామగ్రితో పాటు గోడలకు టైల్స్‌ను ఏర్పాటుచేశారు. మాంసాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్రీజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మాంసం నాణ్యతను నిర్థారించేందుకు పశు వైద్యుడి నియమించారు. మున్సిపల్ స్టాంఫ్తో ధ్రువీకరిస్తారు. ఇందులో 15 మం ది సిబ్బంది ఉంటారు. స్లాటర్ హౌస్‌కు ఆనుబంధంగా నాలుగు షెటర్లను ఏర్పాటు చేశారు.
రూ.87.50 కోట్లతో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిధి రోజు రోజుకూ పెరగడంతో నూతనంగా పెరుగుతున్న ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందించాలనే లక్ష్యంతో రూ.87.50 కోట్లతో అమృత్ 2.0 పథకంలో (రాష్ట్ర ప్రభుత్వం, ఆమృత్ పథకం నిధులు)లతో భాగంగా పెరుగుతున్న పట్టణ అవసరాలకు ఆనుగుణంగా జనా వాసాలకు సరిపోయేలా మంచి నీటి సరఫరాను చేసేందుకు భూ ఉపరితల వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, పట్టణంలో 30 ఏండ్ల కింద వేసిన పైపులైన్ డ్యామేజీలు అయిన చోట పైప్లైన్ల పునరుద్ధరణతో పాటు నూతన పైప్లైన్లను 1000కేఎల్ కెపాసిటీతో 5 ట్యాంక్‌లు నిర్మించనున్నారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహిళా డిగ్రీ కాలేజీ, టీచర్స్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ, కప్పల కుంట, బాలాజీ ఫంక్షన్ హాల్ ఎన్జీవో కాలనీ ట్యాంకులు నిర్మించనున్నారు. వాటర్ రింగ్‌మెన్ నుంచి నీటి సరఫరాకు ట్యాంక్ కనెక్షన్ కోసం పైప్‌లైన్ నిర్మాణం, ఇప్పటికే ఉన్న ట్యాంక్‌లను రిపేర్లు చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి మంచి నీటిని అందించనున్నారు. ఈ పనులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఎక్బాల్ మినార్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు.
కప్పలకుంట రూ. 3.33 కోట్లతో సుందరీకరణ
పట్టణ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి ఉదయం, సాయం కాలం పూట సేదదీరేందుకు చెరువులను సుందరీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కప్పలకుంట కుంటను రూ.3.33కోట్లతో సుందరీకరణ చేయటంతో పాటు అక్కడ బండ్‌ను వైడింగ్ చేయడంతో పాటు డెవలప్ చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనున్నది. ఎకరం విస్తీర్ణంలో పార్క్‌ను నిర్మించనున్నారు.
రూ.20 కోట్లతో పట్టణంలో సీసీ, బిటీ రోడ్ల నిర్మాణం
పట్టణంలో అన్ని వార్డులోని సీసీ రోడ్లు, కాలనీ కనెక్టింగ్ రోడ్లకు బీటీ రోడ్లు నిర్మించేందుకు రూ.20 కోట్లతో 5 ప్యాకేజీల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు పట్టణంలోని కోటి లింగాల ఆలయం వద్ద మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లను వేయనున్నారు. సుమారు 35 నుంచి 40 కి.మీ వరకు రోడ్లను వేయనున్నారు.