పుల్కల్, మే 16: సింగూరు ఎడమ కాలువ పనులు నాసిరకంగా సాగుతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ సమీపం నుంచి వెళ్లిన(ఎల్ఎంసీ)లెఫ్ట్ మెయిన్ కెనాల్ సీసీలైన్ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. ఇంకో ఐదేంద్లయినా కెనాల్ సీసీ లైన్ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదన్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కెనాల్ పనులపై దృష్టి సారించి త్వరగతిన పూర్తయ్యేలా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.
పనులు ప్రారంభించి తొమ్మిది నెలలు గడుస్తుందన్నారు. ఇప్పటికే రెండు పంటలకు సాగు నీరందక రైతులు పంట నష్టపోయారన్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా పనులు చేపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీమంత్రి హరీశ్‌రావు చొరవతో పెండింగ్‌లో ఉన్న కెనాల్ పనులను వెంటపడి మరీ పూర్తి చేయించి చెరువులు నింపామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు సాగు నీరందించేందుకు దిక్కులేదన్నారు.
కెనాల్లో సైడ్‌కు వేసిన టెంప్లెట్ (సిమెంట్ దిమ్మెలు) నాసిరకంగా వేయడంతో పట్టుకోగానే విరిగిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాలువ పనులు నాణ్యతతో చేపట్టా లని, లేనిపక్షంలో పనులను అడ్డుకొని తీరుతామని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. అనంతరం సీసీ పనులపై ఇరిగేషన్ శాఖ డీఈతో ఫోన్లో మాట్లాడి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాచర్ల విజయ్‌కుమార్, శ్రీనివాస్ చారి, మఠం సిద్దన్న, మహేశ్‌బాబు, మల్లారెడ్డి, రాజారామ్, ప్రభాకర్ ఉన్నారు.