దుబ్బాక, డిసెంబర్ 13 : రేవంత్ సర్కారు గురుకులాలను పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం దుబ్బాక ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాలను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాల విద్యార్థులతో మా ట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అద్దె భవనంలో సరైన వసతులు లేవని తెలిపారు. డార్మటరీ గదులు లేక తరగతి గదిలో నిద్రిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే, చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ… కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, వసతి గృహా లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో 49 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశా రు. రేవంత్ సర్కారులో రైతులు, పేదలతో పాటు చివరకు విద్యార్థులు సైతం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. గురుకులాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలు, హామీ ల అమలులో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. దుబ్బాక మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, భూంరెడ్డి, బాలకిషన్‌గౌడ్ ఉన్నారు.